హైదరాబాద్: భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 380 మందిని పట్టుకున్నారు. మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నామని, మరోసారి ఇలాగే దొరికితే మాత్రం కటకటాలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వాహనదారులు చేసిన తప్పేమిటో తెలుసా? తమ వాహనాలపై పోలీస్, ప్రెస్ అనే స్టిక్కర్లు అంటించుకుని తిరగటం.

ఒకవేళ నిజంగా పోలీస్ డిపార్ట్‌మెంట‌్‌లోగాని, మీడియాలోగాని పనిచేస్తుంటే పర్వాలేదు.. గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు చూపిస్తే వదిలేస్తాం.. అలాకాకుండా ఇటు పోలీసు శాఖకుగాని, అటు మీడియాకుగాని ఏమాత్రం సంబంధం లేకుండా వాహనాలపై స్టిక్కర్లు అంటించుకుని తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

స్టిక్కర్ పెట్టుకోవడం.. దూసుకెళ్లడం…

నగరం, శివారు ప్రాంతాల్లో కొంతమంది యువకులు పోలీసులు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఇలా పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు తమ వాహనాలపై అంటించుకుని తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

తనిఖీల్లో భాగంగా తాము ఆపినప్పుడు.. ప్రెస్ రిపోర్టర్లమని, ఫలానా పత్రిక, చానల్‌లో పనిచేస్తున్నామని బుకాయిస్తున్నారని, అంతేకాకుండా, ‘‘మమ్మల్నే ప్రశ్నిస్తారా? ఇదిగో మా గుర్తింపు కార్డు..’’ అంటూ ఉత్తుత్తి గుర్తింపు కార్డులను బయటికి తీస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

స్టిక్కర్ చూడగానే వదిలేస్తున్నారు…

మరికొందరు ఫలానా ఆంగ్ల పత్రిక విలేకరులమంటూ వారే సొంతగా గుర్తింపు కార్డులు తయారు చేసుకుని ఇలా పోలీసులు ఆపినప్పుడు చూపించి తప్పించుకుని పోతున్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ ఠాణాల పరిధుల్లో పదుల సంఖ్యలో ఐపీఎస్‌లు, పోలీస్‌ అధికారులు, విలేకరులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండడంతో.. పోలీస్, ప్రెస్ స్టిక్కర్ ఉన్న వాహనం రాగానే ట్రాఫిక్‌ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో వారి వాహనాలు తనిఖీ చేయకుండా వదిలేస్తున్నారు.

నేరస్థులు కూడా…

ఇది కొంతమంది నేరస్థులకు వరంగా మారింది. వారు కూడా తమ వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతూ పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు ఫలానా పత్రికలో పనిచేస్తున్నా, మా బాబాయి పోలీస్ డిపార్ట్‌మెంటే అని చెబుతూ చక్కా జారుకుంటున్నారు. పాతబస్తీలో కొందరు నేరస్థులు ఇలా ప్రెస్ స్టిక్కర్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఏడాది క్రితం ఓ హవాలా రాకెట్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సోహన్‌లాల్‌ అనే వ్యక్తి పత్రికా విలేకరిగా తనకు తానే గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నట్లు వెల్లడైంది.

అందుకే స్పెషల్ డ్రైవ్…

ఇలాంటి వాటిని అరికట్టేందుకు గత మూడు రోజుల నుంచి నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 380 మందిని హెచ్చరించి వదిలేశారు. రెండోసారి గనుక అలాంటి స్టిక్కర్లతో దొరికితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అనుమానం వచ్చిన వారిని మాత్రమే అపి గుర్తింపు కార్డులు అడుగుతున్నామే తప్ప పరిచయం ఉన్న పోలీసులు, విలేకరులను నిలపడం లేదని పోలీస్‌ అధికారులు తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన అక్రిడిటేషన్‌ కార్డులు చూపిస్తే వదిలేస్తున్నామని చెప్పారు.


English Title:

380 vehicles sporting fake stickers caught in hyderabad