‘కుంభమేళా’ గురించి మీకేం తెలుసు?

kumbamela complete information

prayagraj-kumbh-mela

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభస్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అలాంటి కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ వద్ద త్రివేణీ సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. 

ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. సమస్త దేవతలూ నివసించే స్థలం జలం. హిందువులు నదులను దేవతలుగా భావిస్తారు. నదుల నీటిని.. అందులోనూ ముఖ్యంగా గంగా నదిని మనం ప్రథమంగా స్మరిస్తాం.. పూజిస్తాం. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలో సంగమించడం వల్ల దీనికి ‘త్రివేణీ సంగమం’ అనే పేరు వచ్చింది.

చదవండి: ఆశ్చర్యం: 44 ఏళ్లుగా.. నేలపై కాలుమోపని బాబా! 1975 నుంచి మండపంపైనే…

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి ఈ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభస్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. కుంభమేళా అనేది దేవనాగరి లిపి నుండి వచ్చింది. వేదకాలం నుంచీ ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

అలాంటి కుంభమేళా ప్రయాగ వద్ద త్రివేణీ సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. యునెస్కో కూడా కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. కుంభమేళాను నిర్వహించే ప్రభుత్వానికి ఇంతకు మించిన ప్రచారం ఏదీ ఉండదేమో!

కుంభమేళా అంటే…

కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ‘కుంభం’ అనేది ఒక రాశి కూడా. ‘మేళా’ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

దక్షిణ భారతంలో పుష్కరాలు, పుష్కర స్నానాలు ఏయే నదులకు ఎప్పుడు వస్తాయో మనకు తెలుసు కానీ ఈ కుంభ స్నానాలనేవి కేవలం ఉత్తర భారతంలోని తీర్థాలకే సొంతం. అనేకమంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకే కుంభమేళా.

ఎప్పుడు నిర్వహిస్తారంటే…

సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ కుంభ వేడుకను జరుపుతారు. ఈ కుంభ స్నానాలు ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలోనే జరుగుతాయి. దక్షిణాదిలో నదీ తీరాల వద్ద పుష్కరాలు గురుగ్రహ సంచారంలో ఒక్కొక్క రాశి ప్రవేశంతో ప్రారంభమవుతాయి.

పుష్కరాలు పన్నెండు రోజులపాటు కొనసాగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు మాత్రం ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో ఖగోళ గ్రహ గతుల ఆధారంగా ప్రారంభమవుతాయి.

పుష్కర స్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే, కుంభ స్నానాలకు గురు గ్రహ సంచారంతోపాటు రవి, చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నాన తేదీలను నిర్ణయిస్తారు.

సూర్యుడు-బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్‌లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోను, బృహస్పతి వృషభరాశిలో- సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను, బృహస్పతి-సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీ.

ప్రతి స్థలంలో కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహస్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.

మేషరాశింగతే జీవే మకరే చంద్రభాస్కరౌ
అమావాస్యా తదాయోగః కుంభాఖ్యస్తీర్థనాయకే॥

అంటే.. గురుడు మేషరాశిలో ఉండి రవి, చంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది అని అర్థం. అలా ఏర్పడిన తరువాత మకర సంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్‌తో కుంభస్నానాలు ప్రారంభం అవుతాయి. ఈ గ్రహస్థితి ప్రకారం 2013 జనవరి 14న మకర సంక్రమణం నాడు ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద కుంభమేళా ప్రారంభమైంది.

మరి ఇప్పుడు జరిగేదేమిటి… అనుకుంటున్నారా? ఇది అర్ధ కుంభమేళా.. ప్రధాన కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభ్‌ను నిర్వహించాలని కొన్ని శతాబ్దాల క్రితమే సాధుసంత్‌ల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్‌లలోనే జరుగుతుంది.

ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా ఆరు సంవత్సరాలకు అర్ధకుంభ్‌ను జరుపుతారు. అందువల్ల 2013లో ప్రధాన కుంభమేళా జరిగాక 2019 మకర సంక్రమణమైన జనవరి 15న అర్ధకుంభ్ ప్రారంభమైంది. ఈ అర్ధకుంభ్‌నకు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళా జరిగాక ఆరు సంవత్సరాలు పూర్తి కావాలి.. అంతే!

పురాణాల్లోనూ ప్రస్తావన…

కుంభమేళాల గురించి భాగవతం, మహాభారతం, రామాయణం, విష్ణుపురాణం మొదలైన గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయట.

అందువల్ల ఈ నాలుగు ప్రదేశాల్లో ఒకచోట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు.

తేడా ఏమిటంటే…

ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అనీ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అనీ అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత చేసేదాన్ని మహా కుంభమేళా అంటారు. అంటే 12X12=144 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను మహా కుంభమేళా అని వ్యవహరిస్తారు.

ఈ ఏడాది అర్ధ కుంభమేళా తర్వాత 2025లో పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరం పుణ్యనదుల్లో ఏదో ఒకదానికి పుష్కరాలు వస్తాయి. గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరము వస్తుంది. ఈసారి గురుడు ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు వస్తాయి.

ఇక అర్ధ కుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో ప్రయాగ్‌రాజ్ వద్ద కుంభస్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ అర్ధ కుంభమేళాకి లక్షల మంది అఘోరాలు, సాధువులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

స్కంద పురాణంలో ఇలా…

దేవదానవుల క్షీరసాగర మథనం కథ తెలుసు కదా? అప్పుడు ఉద్భవించిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల నడుమ 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అలాగే కుంభ పర్వాలు కూడా 12 ఉన్నాయి. అయితే అవి మానవులకు నాలుగు, దేవతలకు ఎనిమిది కేటాయించడం జరిగింది.

అందువల్ల భూమిపై నాలుగు, దేవలోకంలో ఎనిమిది కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణం వచనం. దేవదానవ సంగ్రామంలో అమృత కుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు. చంద్రుడు కలశం నుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే, సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసుల నుండి కాపాడితే, శనీశ్వరుడు ఇంద్రుడి నుండి కలశాన్ని కాపాడాడని స్కంద పురాణంలో ఉంది.

చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్ద్ధౌ
దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్‌॥

ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో.. అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు ‘కుంభయోగం’ ఏర్పడుతుంది. అయితే అమృత కుంభం నుంచి కొన్ని అమృత బిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ, అందువల్ల అవి పడిన నాలుగుచోట్ల.. అంటే ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం చెబుతోంది.

విష్ణుద్వారే తీర్థరాజేఁవన్త్యాం గోదావరీతటే
సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్‌॥

స్నాన మహాత్మ్యం…

ప్రయాగ వద్ద స్నానానికి మామూలు రోజుల్లోనే ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక కుంభయోగంలో స్నానం గురించి చెప్పేదేముంది?

అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ
లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలమ్‌॥

అంటే.. వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద వాజపేయ యాగాలు, లక్షసార్లు భూ ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితమో, ప్రయాగలో కుంభస్నానం చేస్తే అంత ఫలితమని విష్ణుపురాణ వచనం.

సహస్రం కార్తికే స్నానం మాఘే స్నానశతానిచ
వైశాఖే నర్మదాకోటిః కుంభస్నానేన తత్ఫలమ్‌॥

అంటే.. వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ స్నానాలు గంగలో చేసిన ఫలితం, కోటిసార్లు వైశాఖ మాస స్నానాలు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని.. ఒక్కసారి ప్రయాగలో కుంభ స్నానం చేయడం వల్ల మానవుడు పొందుతాడని స్కంద పురాణ వచనం.

ఇతర పురాణాల్లోనూ…

గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణ వచనం. ప్రయాగలోని అక్షయవట దర్శనం చేస్తే బ్రహ్మహత్యాది పాతకాలు నాశనం అవుతాయని పద్మ పురాణం చెబుతోంది. ప్రయాగ తీర్థాన్ని అరవై వేల ధనుర్ధారులు గంగానదిని, సూర్యభగవానుడు యమునా నదిని, ఇంద్రుడు ప్రయాగ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడని మత్స్యపురాణం చెబుతోంది.

మాఘమాసంలో త్రివేణీ సంగమ స్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారద పురాణ వచనం. అందువల్ల వీలుచూసుకుని పుణ్యాభిలాషులమై, దురిత క్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగలో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుంటే జన్మ చరితార్థమైనట్లే.

ముఖ్యమైన రోజులు ఇవే…

జనవరి 15న (మంగళవారం) రాజస్నానం..
జనవరి 21న (సోమవారం) పుష్య పౌర్ణమి.. ( ఇవి ఇప్పటికే ముగిశాయి)
ఫిబ్రవరి 4: (సోమవారం) వౌని అమావాస్య..
ఫిబ్రవరి 9: (శనివారం) శ్రీపంచమి..
ఫిబ్రవరి 19: (మంగళవారం) వ్యాసపూర్ణిమ, మాఘపూర్ణిమ..
మార్చి 4 : (సోమవారం) మహాశివరాత్రి..
శివరాత్రి పర్వదినంతో ఈ ఏడాది అర్ధ కుంభమేళా పరిసమాప్తమవుతుంది.