నిజమైన హీరోలు.. వీళ్లు! కానీ ఎంతమందిని ఇలా బలి ఇద్దాం?

the-real-indian-heros, newsxpress.online
- Advertisement -

pulwama-attack-crpf-jawans-bodies

Naa-Maata-By-Armilyరోజూ మనం మొబైల్ ఫోన్‌లో లేదా టీవీలో సినిమా హీరోలను చూస్తుంటాం. కానీ నా దృష్టిలో హీరోలు.. డబ్బు కోసం నటించే వీళ్లు కాదు. దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక.. ఎండనక, వాననక మన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి కాపలా కాసే సైనికులే రియల్ హీరోలు.

రోజూ మనం సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ.. మన విధులు మనం నిర్వర్తించుకుంటూ, పండుగలొస్తే సంబరాలు జరుపుకుంటూ ఆనందంగా బతుకుతున్నాం.. కానీ జాగ్రత్తగా గమనిస్తే.. మనకీ ఆనందం మన సైనికులు పెడుతున్న భిక్ష!

అవును, సరిహద్దుల్లో వాళ్లే గనక కాపలా కాయకుంటే మనం ఈ దేశంలో సురక్షితంగా బ్రతకగలమా? ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ.. ఆ వచ్చిన డబ్బుతో సొంత ఫ్లాట్లు, కార్లు కొనుక్కుంటూ, పుట్టిన రోజులు, పెళ్లిరోజులు జరుపుకుంటూ, బిడ్డల పెళ్లిళ్లు చేసుకుంటూ సంతోషంగా బతికేస్తున్నాం.

నిజంగా సరిహద్దుల్లో సైనికులే గనుక లేకుంటే మనం ఇప్పటి మాదిరిగా ప్రశాంతంగా బతకగలమా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి.

46 మంది హీరోలను ఒకేసారి పోగొట్టుకున్నాం…

అలాంటి 46 మంది హీరోలను ఒకేసారి మనం పోగొట్టుకున్నాం. ఒకే ఒక్క దుర్మార్గుడు వీళ్లందరినీ తన పొట్టనబెట్టుకున్నాడు. చచ్చి స్వర్గంలో ఉంటానన్నాడు.. కానీ కచ్చితంగా నరకానికే వెళ్లుంటాడు. యావత్ దేశ ప్రజల ఉసురుపోసుకున్నవాడు స్వర్గానికి ఎలా వెళ్తాడు? ఇది ఉగ్రవాదం కాదు.. ఒకరకమైన ఉన్మాదం.

మన పిల్లలనే మాయమాటలతో తమ వలలో వేసుకుని వారికి అన్ని రకాల శిక్షణ ఇచ్చి, ఉన్మాదులుగా మార్చి మరీ మన మీదికే ప్రయోగిస్తున్నారు. ఇలాంటి క్రూరులు, దుర్మార్గులు, రాక్షసులకు ఆశ్రయిమిస్తూ.. కావలసిన డబ్బు, ఆయుధాలు సమకూర్చుతూ మన దాయాది దేశం పాకిస్తాన్ మనమీదికి ఉసిగొల్పుతోంది.

ఇన్నేళ్లలో ఎన్ని వందల మంది?

జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపురలో ఇటీవల జరిగింది అతి పెద్ద దాడి అయినప్పటికీ.. దేశంలో చాలాచోట్ల ప్రతీయేటా ఇలాంటి దాడుల్లో ఎంతోమంది మన వీర సైనికులను పాకిస్తాన్ తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటూనే వస్తున్నారు. సరిహద్దుల్లో కంచెను రాత్రివేళ అక్రమంగా దాటుకుని మన దేశంలోకి వ్రవేశిస్తూ.. అదను చూసి మన సైనికుల గుండెలు చీల్చుతున్నారు.

యూరీ ఘటనతో చలించిపోయి.. పాకిస్తాన్ చొరబాటుదారులు, ముష్కరులకు బుద్ధి చెప్పేందుకు ‘సర్జికల్ స్ట్రయిక్స్’ నిర్వహించాం. కుక్క తోక వంకర అయినా పోతుందేమోగానీ, పాకిస్తాన్ వక్రబుద్ధిని వీడుతుందా? దేశ విభజన నాటినుంచీ మనపై ఆ దేశానికి ఎందుకీ వివక్ష? కక్ష??

త్రివర్ణ పతాకాల సాక్షిగా శవ పేటికల్లో…

త్రివర్ణ పతాకం కప్పుకొని వచ్చిన శవపేటికలను టీవీ చానెళ్లలో చూస్తోంటే మనకే గుండె చెరువవుతోంది. ఇక పుత్రశోకం అనుభవిస్తోన్న ఆ అమర జవాన్లను కనిపెంచిన తల్లిదండ్రుల సంగతేంటి? భర్త క్షేమం కోసం రోజూ ప్రార్థించే ఆ భార్యలను ఎవరు ఓదార్చగలరు? తండ్రి కోసం ఎదురుచూపులు చూసే ఆ పిల్లలకు ‘మీ నాన్న ఇక మీకెన్నడూ కనిపించడమ్మా..’ అని చెప్పే ధైర్యం ఎవరికుంది?

కొంతమందికైతే చెక్కపెట్టెపై కప్పబడిన ఆ త్రివర్ణ పతాకమే తప్ప తమ బిడ్డను కడసారి చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. అల్లరుముద్దుగా పెరిగి, మాతృభూమి రక్షణ కోసం సరిహద్దులకు చేరి, శత్రుమూకల పీచమణచడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ వీర జవాన్లు నేడు నెత్తుటి ముద్దలుగా మారి త్రివర్ణ పతాకాల సాక్షిగా ఆ శవ పేటికల్లో శాశ్వతంగా నిద్రిస్తున్నారు. ఏ పాపం చేశారని వారికీ శిక్ష?

ఉగ్రవాదులకు ఎందుకీ పగ?

అసలు ఎవరికైనా మరొకరిపై పగ ఎందుకు? ఏ మత గ్రంథం చెబుతోంది ఉగ్రవాదిగా మారమని, పగ తీర్చుకోమని? భగవద్గీత అయినా,  ఖురాన్ అయినా, బైబిల్ అయినా తోటి వారిని ప్రేమించమనే చెబుతున్నాయికానీ చంపేయమని చెబుతున్నాయా? ‘జీహాద్’, ‘జన్నత్’ల మత్తులో పడి.. దుర్బోధలు విని మారణ హోమానికి తెగిస్తే.. మనిషికి, మృగానికి తేడా ఏముంది?

ఈ మధ్య ఓ వీడియో చూశాను. కాశ్మీరులో నడుచుకుంటూ వెళుతున్న సైనికులపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు అక్కడి పౌరులు కొందరు. ఏ మత గ్రంథంలో చూసినా భూమి, ఆకాశం, గాలి, నీరు, సూర్య చంద్రులు అన్నీ దేవుడు సృష్టించినవే అని చెబుతున్నాయి.  సర్వశక్తిమంతుడైన ఆ పరమాత్మకే లేని పగ మట్టిలోంచి పుట్టి మట్టిలో కలిసిపోయే మనకెందుకు? ప్రేమతో కలిసి మెలిసి బతకలేమా? మనుగడ సాగించలేమా?

నేతల రాజకీయానికి సైనికులే బలి పశువులా?

అసలు దేశ విభజన నాటినుంచీ పాకిస్తాన్‌కి మనమంటే ధ్వేషమే, కానీ ఎందుకలా? వారికి మనమేం అన్యాయం చేశాం? నేరుగా మనల్ని ఢీకొనలేక.. తీవ్రవాదం ముసుగులో మనల్ని ఎప్పటికప్పుడు దాయాది దేశం దెబ్బతీస్తూనే ఉంది. దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తూ మన జవాన్లు నేలకొరిగినప్పుడల్లా.. రాజకీయ నేతల ప్రసంగాలు, సంతాపాలు, సానుభూతులు.. షరా మామూలే!

అసలు ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఈ మారణహోమాన్ని ఆపగలుగుతున్నారా? అందుకు ప్రయత్నమైనా చేస్తున్నారా?

మన దేశంలో రక్షణ, భద్రతకు సంబంధించి ఎన్ని వ్యవస్థలు లేవు? రా, సీబీఐ, ఇంటెలిజెన్స్, కొత్తగా పెట్టిన ఎన్ఐఏ.. ఇవన్నీ ఏం చేస్తున్నట్లు? తీవ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటే మన నిఘా వ్యవస్థలు నిద్రలో జోగుతున్నాయా?

చీకటిమాటున మన దేశంలోకి అక్రమంగా చొరబడే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, ఉన్మాదులను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? లోపం ఎక్కడుంది? మన నిఘా వర్గాల్లోనా? లేక అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్న మన రాజకీయ నాయకుల్లోనా?

పాకిస్తాన్‌పై ఉదార స్వభావం ఎందుకు?

పాముకు పాలుపోసి పెంచినట్లు నిలువెల్లా విషంతో నిండిన పాకిస్తాన్‌ పట్ల మన నాయకులు ఉదార స్వభావాన్ని ఎందుకు చూపిస్తున్నట్లు? ముషారఫ్, నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్.. అసలు పాకిస్తాన్‌లో ఎవరుంటే మనకేంటి? శత్రువని తెలిసి తెలిసీ స్నేహ హస్తం చాచడం ఎందుకు? తీరా వాడు చెయ్యి నరికాక.. లబోదిబో అనడం ఎందుకు?

ఎంతసేపూ ఎన్నికల్లో గెలవడం ఎలా? గెలిచి అధికార పీఠం ఎక్కాక ఎన్నికల్లో ఖర్చుపెట్టిన సొమ్మంతా తిరిగి రాబట్టుకోవడం ఎలా? ఇవేనా లెక్కలు?

సరిహద్దుల్లో దేశ రక్షణలో నిమిషానికో ప్రాణం పోతుంటే.. బుల్లెట్ దిగిన దేహం గిలగిలా కొట్టుకుంటుంటే.. మందుపాతర పేలుడు ధాటికి శరీరం తిమ్మిరెక్కి.. ప్రాణం కొడిగట్టిన దీపంలా రెపరెపలాడుతుంటే.. మొద్దుబారిన మన నాయకుల మెదళ్లకు ఈ విషయం ఎక్కదా?

అవునులే, రేయింబవళ్లు కంటికి కునుకులేకుండా, గడ్డకట్టుకుపోయే చలిలో, తిండితిప్పలు సైతం మర్చిపోయి, క్షణం రెప్ప వాల్చితే ఎక్కడ శత్రువు మన భూభాగంలోకి ప్రవేశిస్తాడో అని నిరంతరం కాపలాకాసే సైనికుడి మదిలో కదలాడే భావాలు… కడుపునిండా తిని, ఏసీ గదుల్లో కూర్చుని, స్కాముల పర్వం గురించి చర్చించుకుంటూ.. పరస్పరం విమర్శలకు దిగే రాజకీయ నాయకులకేం తెలుస్తాయి?

ఎక్స్‌గ్రేషియాతోనో, ప్రభుత్వ ఉద్యోగంతోనో, లేదంటే పరమవీరచక్ర పతకంతోనో విలువగట్టే వారికి సైనికుడి ప్రాణం విలువ ఏం తెలుస్తుంది?

మన దేశ యువత లక్ష్యం ఏది?

ఏ దేశానికైనా యువతే వెన్నెముక! స్వామి వివేకానంద కూడా ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశంలోని యువతరంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరి మన యువత చేస్తున్నదేమిటి? అసలు మన దేశ యువతకు లక్ష్యం అంటూ ఉందా? ఒకప్పుడు డాక్టర్, ఇంజనీరు కావాలని కలలు కనేవాళ్లు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవాలనేది అధిక శాతం యవత కల. కారణం – సాఫ్ట్‌వేర్‌లో అత్యధిక ప్యాకేజీలు లభిస్తుండడమే.

ఆపైన సొంత ఫ్లాటు, సొంత కారు, ఒంటిపై కావలసినంత బంగారం, వార్డ్‌ రోబ్ నిండా కావలసినన్ని దుస్తులు.. తినడానికి కేఎఫ్‌సీలు, మెక్ డొనాల్డ్స్‌ స్టోర్లు, వీకెండ్స్‌లో పబ్‌లు, టోటల్‌గా హ్యాపీ లైఫ్.. ఇవీ నేటి యువత కోరికలు. అసలు జీవితంలో సెటిల్ అవడం అనే కాన్సెప్ట్‌కి ఈ ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం’ అనేది ఒక పర్యాయ పదంగా మారిపోయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయికి వచ్చేసరికి అందరి టార్గెట్ అదే.

అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే అయితే మరి రైతు అయ్యేదెవరు? ఇదెవరూ ఆలోచించరు.. సైనికుడై సరిహద్దుల్లో కాపలా కాసేదెవరు? ఈ ఆలోచనే రుచించదు. రైతు అంటే.. అదో మట్టిబతుకు, సైనికుడంటే అదో భద్రతలేని బతుకు.. ఇలాంటివి ఎవరు కోరుకుంటారు మరి?

నరనరాన దేశభక్తి ఉప్పొంగదా?

మొక్కై వంగనిది మానై వంగునా అన్నది నానుడి. చిన్నతనంలోనే పిల్లలకు ఓ లక్ష్యం అంటూ నిర్దేశించేది వారి తల్లిదండ్రులే. పుట్టీపుట్టగానే మా అమ్మాయిని డాక్టర్‌ని చేస్తాం, మా అబ్బాయిని ఇంజినీరును చేస్తాం అంటూ మురిసిపోతుంటారేగానీ, ఏ తల్లిదండ్రులూ మా అబ్బాయిని సైనికుడ్ని చేస్తాం, దేశమాత రక్షణలో ప్రాణాలొడ్డి పోరాడే వీరుడ్ని చేస్తాం అని అనరు.

ఈ విషయంలో దక్షిణాది వారి కంటే ఉత్తరాదివారే కాస్త నయమేమో. ఎందుకంటే మన సైన్యంలో దక్షిణాది రాష్ట్రాల వారికంటే ఉత్తరాది రాష్ట్రాల వారే అధికం మరి. దేశభక్తిలో ఎందుకీ తేడాలు? మనమంతా ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి కాపలాకాసే 46 మంది జవాన్లను ఆత్మాహుతి దాడి జరిపి ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటే ప్రతి భారతీయుడిలోనూ రక్తం పరుగులు పెట్టాల్సిందేకదా? నరనరాన దేశభక్తి ఉప్పొంగవలసిందే కదా?

క్షిపణులకేం కొదవ లేదు…

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల్లో కొందరిని కదిలిస్తే.. వినిపిస్తోంది ఒకటేమాట. దేశమాత రక్షణ కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించాడని, అయితే తమ వద్ద ఇంకా అలాంటి క్షిపణులు చాలా ఉన్నాయంటూ ఆ మాతృమూర్తులు తమ కడుపున బుట్టిన వారిని చూపిస్తున్నారు.

ఉగ్రవాదుల దాడిలో అన్న మరణిస్తే.. దొంగదెబ్బ తీసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటానంటూ తమ్ముడు ముందుకు దూకుతున్నాడు. కొడుకును పొట్టనబెట్టుకున్నారని తెలిసిన తండ్రి బెబ్బులిలా గర్జిస్తున్నాడు తనకు తుపాకీ ఇమ్మంటూ. ఇదీ దేశభక్తి అంటే..  టీవీ చానళ్లలో వీటన్నింటినీ చూస్తోంటే.. నాకు చిన్నతనంగా అనిపించింది.. అయ్యో.. త్రివర్ణ పతాకం కప్పబడిన పెట్టె ఒక్కటైనా మన రాష్ట్రానికి రాలేదేం అని.

ఎందుకీ నిర్లిప్త ధోరణులు?

ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు అందరిలోనూ దేశభక్తి ఉందా? ఎందుకంటే, సినిమా హాళ్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపనపైనా చర్చ జరుగుతోంది మరి. గతంలో లేనిది ఇప్పుడు అవసరమా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అవును, ఇలాంటి వాళ్లు కూడా ఈ దేశంలో ఉన్నారు.

ఎన్నికలప్పుడు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే భావనతో ఆ రోజున సెలవు ప్రకటిస్తే.. ‘హమ్మయ్య ఒకరోజు సెలవు వచ్చింది.. సరదాగా ఎక్కడికైనా వెళ్దాం..’ అనుకునేవారూ లేకపోలేదు. అందుకే మరి పోలింగ్ శాతం పడిపోయేది.

ముసలి వాళ్లు, నడవలేని స్థితిలో ఉన్నవాళ్లు.. అష్టకష్టాలు పడైనా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటుంటే.. యువతకు వారి బాధ్యత గుర్తుకురాదా? ఇలాంటి నిర్లిప్త ధోరణులు చివరికి దేశాన్ని ఎటు తీసుకెళతాయో?

ఒకడు నేలకొరిగితే.. వందమంది చెయ్యెత్తాలిగా…

ఏ దేశానికైనా యువతే వెన్నెముక. అలాంటి యువతరంపై గురుతర బాధ్యత ఉంటుంది. సరిహద్దుల్లో మన శత్రుదేశమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో జరిగే పోరాటంలో ఒక సైనికుడు నేలకొరిగితే.. ‘మిత్రమా దేశమాత రక్షణలో ప్రాణాలొడ్డి నీ కర్తవ్యం నీవు నిర్వర్తించావు.. నీవు విశ్రమించు.. ఇప్పుడిక మా వంతు..’’ అంటూ వంద చేతులు తుపాకులెత్తాలి.

కానీ అలా జరగడం లేదే? మనకి దేశమంటే గుర్తుకొచ్చేది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున, మళ్లీ జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున. అప్పుడు కూడా ఏదో రొటీన్ వ్యవహారంలా జెండా ఎగరేసి, మిఠాయిలు పంచేసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ సరిహద్దులో సైనికులకు అలా కాదే? వారికి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు కూడా దేశమే.. దేశ రక్షణే.

అసలు మన పిల్లలకు చిన్నతనం నుంచే బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్‌లు మాత్రమే కాదు, వాటిలో దేశభక్తిని కూడా రంగరించి పోయాలి. అప్పుడే కాసిన్ని విలువలైనా వంటబడతాయేమో.

పిల్లలకు మనం ఏం పంచుతున్నాం?

నేడు చాలామంది పిల్లలకు సినిమా హీరోల గురించి తెలిసినంతగా స్వాతంత్ర్య పోరాటయోధుల గురించి తెలియడం లేదు. ఏ పాట ఏ సినిమాలోదో ఠక్కున చెప్పేస్తారు. ప్రభాస్ స్టెప్స్ ఏవో, మహేష్‌బాబు స్టెప్స్ ఏవో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. గాంధీ ఎవరో తెలుసుగానీ పటేల్ ఎవరో తెలియదు. అలాగే భగత్ సింగ్ తెలుసుగానీ సుఖ్‌దేవ్ ఎవరో తెలియదు.

మరికొందరు భగత్ సింగ్ ఎవరు? ఆయనేం చేశాడు అని అడుగుతున్నారు. ఇది కూడా తెలియదు. ఇది బాధాకరమైన విషయం కాదా?

మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతే ‘‘హూ ఈజ్ గాంధీ అండ్ భగత్ సింగ్..’’ అని అడిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన కడుపునబుట్టిన వారికి మన సంపాదనలో వాటా ఇస్తున్నాంగానీ.. మన జ్ఞానాన్ని మాత్రం పంచడం లేదు. ఇటు ఇళ్లల్లో తల్లిదండ్రులుగానీ.. అటు పాఠశాలల్లో గురువులుగానీ చెప్పకపోతే వారెలా తెలుసుకుంటారు?

త్రివిధ దళాల్లో ఏడాదిపాటైనా…

పదహారేళ్లు వచ్చాయో లేదో.. ప్రేమలు. ఈ ప్రేమ మత్తులో కని, పెంచిన తల్లిదండ్రులు కూడా కనిపించరు. కాదంటే లేచిపోవడం, మళ్లీ ఇందులో పగలు, పరువు హత్యలు.. ఇలాంటి పరిస్థితుల్లో పడి కొట్టుకున్నంత కాలం యువతకు దేశం, దేశభక్తి ఏం తెలుస్తాయి. మరణిస్తామని తెలిసీ.. కదనరంగానికి కదిలే సైనికులు, జవాన్ల త్యాగం, దేశభక్తి గురించి నేటి తరానికి, ఆ తరువాత ప్రతి తరానికి అర్థం కావాలంటే చేయాల్సింది ఒక్కటే.

ఇంటర్మీడియెట్ తర్వాత ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనీసం ఒక సంవత్సరమైనా త్రివిధ దళాలలో ఏదో ఒక దానిలో పనిచేసేలా ప్రభుత్వాలు నిబంధన తీసుకురావాలి. అప్పుడే క్రమశిక్షణ అలవడుతుంది. సరిహద్దులో సైనికులకు రోజెలా గడుస్తుందో తెలిసొస్తుంది. పూటపూటకీ తిండి తిన్నట్లే.. గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ‘యే మేరె వతన్ కే లోగో..’ పాటను చెవులరిగేలా ప్రతిపూటా వినిపించాలి.. ఏమంటారూ?

 

- Advertisement -