ఫ్లాష్‌బ్యాక్: ఎన్టీఆర్ చిత్రపటం తీసుకొచ్చిన చిక్కు! 1989లో గెలిచి ఓడిన ఇద్దరు ఎమ్మెల్యేలు!

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ నాయకుడి చిత్రపటాన్ని ఉపయోగిస్తే తప్పేముంది? అనుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు. అనుకున్నదే తడవుగా.. ఆ నాయకుడి చిత్రపటాన్ని ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. కానీ చివరికి వచ్చేసరికి.. ఆ చిత్రపటమే పెద్ద చిక్కు తీసుకొచ్చి పెట్టింది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. వారు చేసిన పని కారణంగా ఇద్దరికీ ఎమ్మెల్యే గిరీ ఊడిపోయింది. ఇంతకీ ఆ చిత్రపటం ఎవరిది? ఆ ఎమ్మెల్యేలు ఎవరు? అసలిదంతా ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి…

అమరావతి: అది 1989వ సంవత్సరం. అప్పటికే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంవీ కృష్ణారావు టీడీపీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కృష్ణారావు అప్పటికే ఎమ్మెల్యే. స్వస్థలం కృష్ణా జిల్లా అయినా ఈయన ఇచ్ఛాపురంలో స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతుడు కూడా. 1983లో టీడీపీ ప్రభంజనంలో తొలిసారిగా ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తరువాత 1985లో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆయన సునాయాసంగా గెలిచారు. అంతేకాదు, 1989 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన బి.త్రినాథరెడ్డిపై గెలుపొందారు. కానీ గెలిచిన కొద్దికాలానికే ఎంవీ కృష్ణారావు శాసనసభ్యత్వం రద్దు అయింది. అంతేకాదు, ఆయనపై ఆరేళ్లపాటు అనర్హత వేటుకూడా పడింది.

ఎందుకంటే…
దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థి త్రినాథరెడ్డి, ఆయన తరుపున మరికొందరు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 12(3) కింద కేసు వేయడమే. ఈ కేసులో విచారణ జరిపిన అప్పటి ఉమ్మడి హైకోర్టు ఎంవీ కృష్ణారావు ఎన్నిక చెల్లదంటూ 1992లో తీర్పు ఇవ్వడమేకాకుండా ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించినా…

ఈ తీర్పుపై ఎంవీ కృష్ణారావు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. దీంతో పాపం ఎంవీ కృష్ణారావు 1994 నాటి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. ఇదే మంచి అవకాశంగా భావించిన కాంగ్రెస్ అభ్యర్థి త్రినాథ రెడ్డి 1994లో ఎన్నికల బరిలోకి దిగినా పరాజయం తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన డి.అచ్యుత రామిరెడ్డి చేతిలో ఆయనా ఓడిపోయారు.

ఎంవీ కృష్ణారావు తిరిగి 1999లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచిన నేత కూడా ఈయన ఒక్కరే. అయితే, 2004లో పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఎంవీ కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో ఆయన అనారోగ్యంతో మృతిచెందారు.

చేసిన తప్పేమిటంటే…

ఇంతకీ 1989 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎంవీ కృష్ణారావు పదవి ఊడడానికి, ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఎన్టీఆర్ ఫొటో. అవును, ఇది నిజమే! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంవీ కృష్ణారావు తమ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఫొటోలు జనానికి పంచిపెట్టారు.

కాకపోతే, ఆ ఫొటోలో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో శంఖం పూరిస్తూ ఉన్నారు. అదే పెద్ద తప్పైపోయింది. ఆ ఫొటోలు పంచిపెట్టడం ఒక రకంగా ఓటర్లను మతపరంగా ప్రలోభపెట్టడమేనని ఆయన ప్రత్యర్థి త్రినాథరెడ్డి హైకోర్టులో వాదించారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంతో.. ఎంవీ కృష్ణారావు ఎన్నిక చెల్లదంటూ 1992లో హైకోర్టు తీర్పునిచ్చింది.

పాతపట్నంలో ఏం జరిగిందంటే…

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 1989లో విజయం సాధించిన కలమట మోహనరావు కూడా ఇదే తప్పు చేశారు. ఎన్నికల ప్రచారంలో.. శ్రీకృష్ణుడి వేషధారణలో శంఖం ఊదుతున్న ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఆయన కూడా ప్రజలకు పంచిపెట్టారు. ఆ ఎన్నికల్లో 274 ఓట్ల ఆధిక్యంతో.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన నారాయణరావుపై గెలుపు కూడా సాధించారు.

అయితే… ఆయన ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు హైకోర్టును ఆశ్రయించారు. మోహన్ రావు మతపరంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఎన్టీఆర్ కృష్ణుని రూపంలోని ఫొటోలు పంచిపెట్టారని, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 నిబంధనలకు ఇది విరుద్ధమని వాదించారు. అంతే.. కలమట మోహన్‌రావు ఎమ్మెల్యే గిరీ ఊడిపోయింది. అంతేకాదు, ఆయనపై అనర్హత వేటు కూడా పడింది.

అయితే ఈ కేసు విచారణలో ఉండగానే 1994లో మళ్లీ ఎన్నికలు రావడం, కలమట మోహన్ రావు మరోసారి టీడీపీ నుంచి గెలవడం కూడా జరిగిపోయాయి. 1989 ఎన్నికల కేసులో హైకోర్టు 1996లో తీర్పు ఇచ్చింది. దీంతో 1996లో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినా.. అనర్హత వేటు పడడంతో కలమట మోహనరావు పోటీ చేయడానికి వీలు లేకుండాపోయింది. దీంతో ఆయన ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున తన భార్య వేణమ్మను రంగంలోకి దించారు.

అయితే ఈ ఉప ఎన్నిక లక్ష్మీపార్వతికి లక్కీ ఛాన్స్‌గా మారింది. ఎన్టీఆర్ టీడీపీ తరుపున పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె మోహనరావు భార్య వేణమ్మపై.. భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ మళ్లీ మళ్లీ 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తిరిగి కలమట మోహనరావే గెలిచారు.. అది వేరే సంగతి!

కలమట మోహనరావు మొత్తం ఐదు సార్లు పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మోహనరావు తనయుడు కలమట వెంకటరమణ ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి.. తరువాత టీడీపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వెంకటరమణ టీడీపీ నుంచే ఇక్కడ పోటీ చేస్తున్నారు.

ఆ చట్టం ఏం చెబుతుందంటే…

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 123(3) ప్రకారం మతం, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, వారి తరఫున ప్రచారం చేసే ఏజెంట్లు, మద్దతుదారులు దేశంలోని భిన్న వర్గాల మనోభావాలను కించపరిచేలా లేదా శత్రుత్వ భావాలను పెంచేలా ప్రచారం చేయడం, ప్రయత్నించడం చేయకూడదు.

కృష్ణుడి రూపంలో శంఖం పూరిస్తోన్న ఎన్టీఆర్ ఫోటో ఒక మతం వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి.. అలాంటి ఫొటోలు ఓటర్లకు పంచిపెట్టడం అంటే.. వారిని ప్రలోభపెట్టడమే అవుతుంది. అందుకే ఈ పని చేసిన ఒకే జిల్లాకు చెందిన ఎంవీ కృష్ణారావు, కలమట మోహన్ రావు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ.. ఆ తరువాత హైకోర్టు తీర్పుతో పదవి పోగొట్టుకుని ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యారు.

అయితే పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. 1989లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముళ్లపూడి వెంకట కృష్ణారావుపైనా ఇదేవిధంగా కేసు దాఖలు అయింది. ఆయన ఓటర్లకు కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ చిత్రపటాలు పంచారని, తద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 123(3)ను ఉల్లంఘించారని ఆయన ప్రత్యర్థి వాదించారు. అయితే దీనికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేక రుజువు చేయలేకపోవడంతో వెంకట కృష్ణారావు శాసనసభ్యత్వం రద్దు కాలేదు.

 

- Advertisement -