ఢిల్లీ కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు, అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్, సహాయానికి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్…

delhi-pcc-president-sheila-dikshit-1
- Advertisement -

delhi-pcc-president-sheila-dikshit

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఆమెను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు.

ఇప్పటివరకూ ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా ఉన్న అజయ్‌ మాకెన్‌ అనారోగ్య కారణాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ షీలా దీక్షిత్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్‌ బలహీనపడటంతో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా…

దీనిపై ఏఐసీసీ ఢిల్లీ యూనిట్ ఇన్‌ఛార్జి పీసీ చాకో మాట్లాడుతూ.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా షీలాదీక్షిత్ నియమితురాలయ్యారని, ఆమెకు పార్టీ వ్యవహారాల్లో సహకరించేందుకు దేవేందర్ యాదవ్, హరూన్ యూసుఫ్, రాజేష్ లిలోటియాలను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించబోతున్నామని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఆమ్ అద్మీ పార్టీతో పొత్తులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షీలా దీక్షిత్‌కు మాజీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సారథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ తిరిగి జవసత్వాలు పుంజుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -