ఓటరు కార్డు అనుకునేరు.. కాదండీ ఇది పెళ్లి శుభలేఖ!

oter card
- Advertisement -

బెంగళూరు: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనుషుల్లో, వారు చేసే పనుల్లో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఏదైనా వినూత్నమైన విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. అది ఇట్టే వైరల్ అవుతోంది.

ఒకప్పుడు ఎక్కడ ఏం జరిగినా అది ప్రింట్ మీడియాలో వస్తేగాని జనానికి తెలిసేది కాదు. ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. సమాచార వీక్షణ అధికమైంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఇలా పోస్ట్ చేశారో లేదో, అలా వైరల్ అయిపోతోంది. లక్షల కొద్దీ లైకులు, షేర్లు.

విషయం ఏమిటంటే.. వివాహ పత్రికలు ఎన్నో రకాలుగా దర్శనమిస్తుంటాయి.  ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ ఆహ్వాన పత్రికలు అచ్చు వేయిస్తుంటారు. కాకపోతే ఈ మధ్య తమ పెళ్లికార్డును ఎంత వెరైటీగా రూపొందిస్తే అంత బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

తాజాగా ఓటర్ ఐడీ కార్డు మాదిరిగా తయారైన ఓ శుభలేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నెలకొన్న తరుణంలో వెరైటీగా ఉండటమే కాదు ప్రజల్లో మంచి చైతన్యం తేవాలన్న ఆలోచనతో  శుభలేఖను కూడా ఇలా ఓటరు గుర్తింపు కార్డులా ప్రచురించామని వధూవరులు చెబుతున్నారు.

కర్ణాటకలోని ధార్వాడలో బెస్కాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్‌ కుమారుడు సునీల్‌‌కు, హెస్కాంలో ఇంజనీర్‌‌గా పని చేస్తున్న మహేశ్‌ అనే యువకుడి సోదరి అన్నపూర్ణకు ఈనెల 26న వివాహం నిశ్చయించారు. పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, వీరు తమ శుభలేఖను ఇలా వినూత్నంగా తీర్చిదిద్దారు.

- Advertisement -