న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై లోక్‌సభలో శుక్రవారం చర్చ వాడివేడిగా సాగింది. ఈ ఒప్పందంపై రక్షణశాఖకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందంటూ ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.

ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై ధ్వజమెత్తారు. రాఫెల్పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అదే స్థాయిలో తిప్పికొట్టారు.

‘రాఫెల్ ఒప్పందంపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. పీఎంవో సమీక్షను జోక్యం చేసుకోవడం అని చెప్పలేం. రక్షణశాఖ నివేదికకు అప్పటి రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ వివరణ ఇచ్చారు. దాని గురించి మీడియా ఎక్కడా చెప్పలేదు. ఒప్పందం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగా జరిగింది. దీనిపై మేం ఇటు పార్లమెంట్‌లోనూ అటు కోర్టులోనూ స్పష్టతనిచ్చాం. ఇంకా దీనిపై మాట్లాడటం సమయం వృథా..’ అని నిర్మలా సీతారామన్‌ తేల్చిచెప్పారు.

కాంగ్రెస్‌ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, సైన్యం, వైమానిక దళాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మల్టీనేషనల్‌ కంపెనీల చేతుల్లో ప్రతిపక్షం కీలుబొమ్మలా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చచ్చిన గుర్రంపై స్వారీ చేయాలనుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్‌కు మతిభ్రమించింది..: బీజేపీ

రాహుల్‌ మతి స్థిమితం కోల్పోయారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసత్యాలు పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కాబోవని స్పష్టం చేసింది.


English Title:

flogging a dead horse nirmala sitharaman tells lok sabha on rafale