ప్రజలకే చెబుతా, 22 పేజీల బుక్ రాస్తే పోలీసులు లాక్కున్నారు: జగన్‌పై కత్తిదాడి కేసులో నిందితుడు

1:35 pm, Sat, 19 January 19
attack on ys jagan

attack on ys jagan

అమరావతి/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తన వాదనను వినిపించారు.

తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరాడు శ్రీనివాస్. అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో తాను ప్రజలకు చెబుతానని తెలిపాడు. జగన్ పై ఎందుకు దాడి చేశానో జైలులో ఉన్నప్పుడు 22 పేజీల పుస్తకం రాశానని వివరించాడు.

జైలర్ దాన్ని తన దగ్గరి నుంచి లాక్కున్నారనీ, ఆ పుస్తకాన్ని తనకు ఇప్పించాలని న్యాయమూర్తిని శ్రీనివాసరావు కోరాడు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా,  మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు.

శ్రీనివాసరావు తరఫు లాయర్ తన వాదనను వినిపిస్తూ.. తమ క్లయింట్‌ను 30 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు రహస్యంగా విచారణ జరిపారని తెలిపారు. విచారణ జరిపేటప్పుడు లాయర్లు ఉండాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ జైలులో శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని అతని తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇతర ఖైదీలను కలవకుండా అతనికి రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని కోరారు.

ఈ నెల 25 వరకు రిమాండ్

జగన్‌పై కత్తితో దాడి కేసులో సిట్‌ దర్యాప్తు వివరాలను ఎన్‌ఐఏకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. తక్షణమే మొత్తం దర్యాప్తు వివరాలను ఎన్‌ఐఏకు ఇవ్వాలని ప్రత్యేక న్యాయస్థానం సిట్‌కు స్పష్టంచేసింది. జగన్మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు జనవరి 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు, సిట్‌ అధికారులు సహకరించడం లేదని ఎన్‌ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు జనవరి 23న వింటామని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ, సిట్‌ అధికారులను ఆదేశించింది.