జైపూర్‌లో ’జికా‘ వైరస్.. పరీక్షల్లో ఏడుగురికి పాజిటివ్, అప్రమత్తమైన కేంద్రం

Zika Virus
- Advertisement -

Zika Virus

జైపూర్: ఎడారి రాష్ట్రం  జైపూర్‌లో జికా వైరస్ కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. జికా వైరస్ పరీక్షలో ఏడు కేసులు పాజిటివ్‌గా తేలాయి. విషయం తెలిసి ప్రధాన మంత్రి కార్యాలయం అత్యవసర అప్రమత్త ప్రకటన విడుదల చేసింది. కేంద్రారోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయమై మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఓ బృందం జైపూర్‌కు బయలుదేరనుంది.

సెప్టెంబర్ 24న జికా వైరస్‌లో పాజిటివ్ కేసుగా ఒక వ్యక్తిని గుర్తించారు. అనంతరం 22  శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ‌ఆఫ్ వైరాలజీలో ల్యాబ్ కి పంపారు. ఈ నేపథ్యంలో జైపూర్ లో జికా వైరస్ వ్యాప్తిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. జైపూర్‌లోని ఎస్ఎంఎస్ హాస్పటల్‌లో జికా వైరస్ సోకిన ఏడుగురిని చేర్చారు.  నిరంతరం రాజస్థాన్ ఆరోగ్యశాఖ వారిని పర్యవేక్షిస్తోంది.

జైపూర్‌లోని శాస్త్రినగర్‌లో మొదటి కేసు నమోదైంది. వెంటనే అక్కడ ప్రభుత్వం మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.  179 వైద్య బృందాలు ఆరు వార్డుల్లో  24గంటలూ పని చేస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అన్ని జిల్లా ఆరోగ్యశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.  జికా సోకిన వ్యక్తుల్లో ఒక బీహారీ కూడా ఉన్నాడు. అతను ఈ మధ్యే సైవాన్‌కు వచ్చి వెళ్ళాడు.

ఈ నేపథ్యంలో బీహారీలపై కూడా నిఘా పెట్టాల్సి వచ్చింది. గత సంవత్సరం బ్రెజిల్‌లో జికా వైరస్ తీవ్ర సమస్యలు సృష్టించిన విషయం తెలిసిందే. వైరస్ సోకిన గర్భిణీలు..  మైక్రో సెఫలీ వ్యాధితో భాధపడే పిల్లల్ని ప్రసవించారు.

zika virus (1)

ఇంతకీ ‘జికా’ అంటే  ఏమిటి?

జికా వైరస్‌ .. ఒక దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది కుట్టగానే వళ్లంతా ఎర్రగా దద్దుర్లు వస్తాయి. దీనివల్ల నాడీ సంబంధమైన వ్యాధులు వస్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మైక్రో సెఫలీ, గిలియన్‌-బేర్‌ అనే  రుగ్మతగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమావేశంలో వ్యాప్తి తీవ్రత, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై  దేశంలోని ప్రముఖ డాక్టర్ల సలహాలు  కోరనున్నారు.

ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయమే స్పందించిందంటే.. అసలు జికా అంటే  ఏమిటి? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది భారతదేశ సమస్య కాదు.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధిని గుర్తించగానే ఎటువంటి మందులు ఇవ్వాలనేదానిపై కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి… 

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి ఈ జికా వైరస్ సోకి ఉండవచ్చునని డబ్ల్యూటీవో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అంచనా వేస్తోంది. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ప్రస్తుతం ఈ వైరస్‌ వ్యాప్తి బాగా ఉందనీ, 23 దేశాలు, మారుమూల ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయని  తెలిసింది.  దీంతో అన్ని దేశాలు తమ తమ దేశాల్లోని  ఆరోగ్యశాఖలకు, మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. మన ప్రధానమంత్రి కార్యాలయం  ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం కూడా ఇదే.

ప్రపంచానికి కొత్త ముప్పు…

ప్రపంచాన్ని గతంలో ఎయిడ్స్ వణికించింది.  ఆ తర్వాత స్వైన్ ఫ్లూ వచ్చింది. వీటికి మందు కనుక్కునే లోపు కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు జికా వైరస్.. వీటన్నింటినీ మించినట్టే ఉంది. భారతదేశంలో కూడా వీటి లక్షణాలు ఉండటంపై  సర్వత్రా  ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే  ఇది ప్రపంచ దేశాల సమస్య కాబట్టి పరిష్కారం త్వరగానే దొరుకుతుందని కొందరు ప్రముఖ వైద్యులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -