న్యూఢిల్లీ: మీరు డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.. ప్రస్తుతం ఉన్న కార్డులు జనవరి 1, 2019 నుంచి చెల్లవు. వీటి గడువు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకే. ఈ మేరకు ఆగస్టు 27,2015న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అదేశాలు జారీ చేసింది. ఈ గడువు వచ్చే డిసెంబర్ 31తో ముగియనుంది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. జనవరి 1, 2019 నుంచి కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ మీ వద్ద ఇంకా పాత డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే వెంటనే వాటిని మార్చుకోండి. దీనికోసం మీ సమీప బ్యాంకు బ్రాంచిని సందర్శించండి. లేదంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
ఇంతకీ విషయం ఏమిటంటే… డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఈ మోసాలను అరికట్టాలంటే.. మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులు తమ వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది.
EMV చిప్, పిన్ ఉన్న కార్డులు మాత్రమే…
దీనికోసం ఆర్బీఐ ఆగస్టు 27,2015 నే ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 2015 నుంచి ప్రతి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులో ఇఎంవి (EMV) చిప్ ఉండాలి. అదే విధంగా అది PIN అధారిత కార్డు అయి ఉండాలి.
EMV చిప్ అంటే.. EuroPay MasterCard and Visa (EMV) చిప్. దీనికి తోడు పిన్ నెంబర్ కూడా ఉంటుంది. సిమ్ కార్డులపై ఉన్నట్లుగానే ఈ EMV ప్రమాణాలు కలిగిన డెబిట్, క్రెడిట్ కార్డుల మీద ఎడమ వైపున గోల్డ్ కలర్ చిప్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ రకమైన భద్రతా ప్రమాణాలు కలిగిన కార్డులను క్లోనింగ్ చేయడం కష్టం.
డిసెంబర్ 31 తుది గడువు…
ఆన్లైన్ కేటుగాళ్లు దొంగ కార్డులను ఉపయోగించి ఎక్కడా మోసం చేయకుండా ఉండేందుకు EMV సపోర్టు ఉన్న కార్డులను ఖాతాదారులకు అందించాలని, ఇందుకు మూడేళ్ల గడువు కూడా ఇస్తున్నామని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తానికి అప్పట్లో ఆర్బీఐ ఇచ్చిన గడువు ఈ డిసెంబర్ 31న ముగుస్తుంది.
ఇప్పటికే దేశంలోని అన్ని బ్యాంకులు ఈ రకం డెబిట్, క్రెడిట్ కార్డులను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంకా పాత డెబిట్, క్రెడిట్ కార్డులు కనుక వినియోగిస్తుంటే.. అలాంటి వారు బ్యాంకు బ్రాంచిని సంప్రదిస్తే.. పాత కార్డు స్థానంలో EMV ఫీచర్లు కలిగిన సరికొత్త డెబిట్, క్రెడిట్ కార్డులను అందిస్తారు.
పాత కార్డులను వాపసు చేసి కొత్త కార్డులను తీసుకునేందుకు ఇంకా నెలరోజులు గడువుంది.. కనుక ఇప్పటి వరకు తీసుకోని వారు కనీసం డిసెంబర్ 31లోగా వీటిని తీసుకుంటే లావాదేవీల సమయంలో ఎలాంటి ఇబ్బంది కలుగదు.