న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారతదేశంలో తన ఇ-కామర్స్ బిజినెస్‌ను మరింత విస్తరించాలని, రిటైల్ బిజినెస్ రంగంలో మరింత దూసుకుపోవాలని ప్రణాళికలు రచిస్తోంది. టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణ కోసం భారీగా టెక్కీలను నియమించుకునేందుకు సిద్దపడుతోన్న వాల్‌మార్ట్ దేశీయంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను నియమించుకోనుంది.
‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఇ-కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్‌కు దీటుగా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తోంది. గుర్గావ్, బెంగళూరు ద్వారా సేవలను అందిస్తున్నఈ సంస్థలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులున్నారు. సంవత్సరానికి సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికా వెలుపల ‘వాల్‌మార్ట్ ల్యాబ్స్’ పేరుతో ఇండియాలో అతిపెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
వాల్‌మార్ట్ తాజాగా ఎంపిక చేయనున్న టెక్కీలకు రూ.6 లక్షలనుంచి రూ.22 లక్షల వరకు వేతనాలను ఆఫర్ చేయనుంది. ఉత్పత్తి ఆధారితంగా సంస్థగా ఉండేందుకు, ప్రధానంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టామని, త్వరలోనే మరింత మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని వాల్‌మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు.