45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత: మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు

rahul-modi
- Advertisement -

modi-rahul

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) కీలక అంశాలను వెల్లడించింది. దేశంలో నాలుగున్నర దశాబ్ధాల గరిష్టస్ధాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని ఈ సర్వే పేర్కొంది.

2017-18లో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేని విధంగా 6.1 శాతానికి ఎగబాకిందని నివేదిక వెల్లడించింది. అధికారికంగా విడుదల కాని ఈ సర్వే నివేదిక తమకు అందుబాటులో ఉందని బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదిక అంశాలను ప్రస్తావిస్తూ తెలిపింది. మధ్యంతర బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు వెలుగులోకి వచ్చిన ఈ నివేదిక ఆధారంగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడికి పదునుపెట్టాయి.

మరోవైపు నివేదిక వెల్లడించడంలో జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ గణాంక కమిషన్‌ తాత్కాలిక చైర్మన్‌ పీసీ మోహనన్‌ సహా ఇద్దరు సభ్యులు కమిషన్‌ నుంచి తప్పుకున్నారు. కాగా, నిరుద్యోగిత రేటు పెరగడంపై నోట్ల రద్దు ప్రభావం ఉన్నట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అత్యధికంగా 7.8 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా నమోదైంది.

ఆర్ధిక కార్యకలాపాల్లో గత సంవత్సరాల కంటే కార్మిక ఉద్యోగుల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఉద్యోగుల సమూహం నుంచి బయటకువస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

మోడీపై రాహుల్ విమర్శలు…

ఈ సర్వే వెలువడిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. మోడీ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18 కాలంలో నమోదైందని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక వివరాలను ప్రస్తావిస్తూ.. మోడీ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ ఏమైందని ప్రశ్నించారు.

అంతేగాక, ‘నమో జాబ్స్‌.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఓ నిరంకుశ నేత హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ఉద్యోగాల విషయంలో బయటకు వచ్చిన ఈ నివేదిక ఓ జాతీయ విపత్తు వంటి పరిస్థితిని సూచిస్తోంది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా నిరుద్యోగం ఉంది. 6.5 కోట్ల మంది యువత 2017-18 కాలంలో నిరుద్యోగులుగా మిగిలారు. నమో వెళ్లాల్సిన సమయం వచ్చింది..’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు #HowsTheJobs అనే హ్యాష్‌టాగ్‌తో మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -