గంజాం: వారు ఆ ఇంటికి దొంగతనానికి వచ్చారు. అక్కడ దొరికిన సొత్తు మొత్తాన్ని ఎత్తుకుని వెళ్లారు. సొత్తుతోపాటు అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోతున్న తొమ్మిదేళ్ల బాలికను కూడా ఎత్తుకుపోయారు. అనంతరం ఆ బాలికను ఊరికి దూరంగా తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా దొయికాన గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే… దొయికాన గ్రామంలోని ఓ కుటుంబం మొత్తం రాత్రిపూట ఒకేచోట పడుకున్నారు. తెల్లవారుజామున మేల్కొన్న తల్లి.. పక్కనే పడుకున్న కూతురు కనిపించక పోవడంతో ఆందోళనతో ఆమె భర్తను నిద్రలేపింది. అంతేకాకుండా వారి ఇంట్లో సామన్లు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడం, అల్మరాలో దాచిన రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో తమ ఇంట్లో దొంగతనం జరిగిందని వారు నిర్ధారణకు వచ్చారు.
దొంగతనానికి వచ్చిన దొంగలు తమ కుమార్తెను కూడా ఎత్తుకు వెళ్లి ఉంటారన్న అనుమానంతో వారు గ్రామస్థుల సాయంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ చోట నుండి బాలిక ఏడుస్తూ వాళ్ళకి ఎదురు రాగా, వారు అ చిన్నారిని ఆందోళనతో ప్రశ్నించారు.
‘‘ఎవరో ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు నన్ను గడ్డివాము చాటుకు తీసుకెళ్లి.. బెదిరించి నాపై అత్యాచారం చేశారు..’’ అని ఆ బాలిక చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. వారు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.