గుండె పగిలే విషాదం.. నిమజ్జనం కోసం చెరువులోకి దిగి ఆరుగురు చిన్నారుల మృత్యువాత!

3 days ago

కేజీఎఫ్ (కర్ణాటక): వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఆరుగురు విగ్రహంతో చెరువులో దిగారు. ఇద్దరు ఒడ్డున నిల్చున్నారు.

విగ్రహాన్ని పట్టుకుని చెరువులోకి దిగిన ఆరుగురు చిన్నారులు క్రమంగా మునిగిపోతుండడంతో బయట నిల్చున్న ఇద్దరు భయంతో గ్రామంలోకి పరుగులు తీసి పెద్దలకు విషయం చెప్పారు.

వారు చెరువు వద్దకు చేరుకునే సరికే చెరువులో దిగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో వైష్ణవి (12), ఆమె సోదరుడు రోహిత్ (10), తేజశ్రీ (11), ఆమె 8 ఏళ్ల సోదరి రక్షిత, రోహిత్ (10), ధనుష్ (10)లు ఉన్నారు.

వీరందరూ మరథఘట్టకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు లముకున్నాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.