న్యూఢీల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నెట్ బ్యాంకింగ్ సదుపాయానికి సంబంధించి మీరు మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోలేదా…? అయితే ఈ డిసెంబర్ 1 వ తేదీ తర్వాత మీ నెట్ బ్యాంకింగ్ సదుపాయం నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్‌బీఐ వినియెగదారుల కోసం తమ వెబ్‌సైట్‌లో ఇచ్చింది .
‘ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు… వెంటనే మీ మొబైల్ నెంబరును రిజిస్టర్ చేయించుకోండి. లేదంటే డిసెంబరు 1, 2018 నుంచి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయి..’ అని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువులోపు తమ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ ఇంకా ఈ-మెయిల్ అలర్ట్‌ల ద్వారా బ్యాంకులు తమ యూజర్‌లకు తప్పని సరిగా తెలియజేయాలని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ జూలై 6, 2017 లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమ నెట్ బ్యాంకింగ్‌కు మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్‌బీఐ తన ఖాతాదారులకు సూచించింది.