ముందు రివ్యూ పిటిషన్.. ఆ తర్వాతే డిస్కషన్: తేల్చేసిన శబరిమల ఆలయ పూజారులు

kerala-sabarimala-priests
- Advertisement -

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. మొదట ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆ తరువాతే తమను చర్చలకు పిలవాలని తేల్చి చెప్పారు.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై ఆలయ ప్రధాన పూజారి, ఇతర పూజారులు గుర్రుగా ఉన్నారు.

సుప్రీం తీర్పుపై భగ్గు…

సుప్రీంకోర్టు తీర్పును తొలుత స్వాగతించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు కూడా సిద్ధమని ప్రకటించడంతో శబరిమల పూజారులు భగ్గుమన్నారు. ముఖ్యంగా కొట్టాయం, మలప్పురం జిల్లాల్లో పలువురు భక్తులు కూడా ఆందోళనలు చేపట్టారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులూ, హింసాయుత సంఘటనలూ చోటుచేసుకున్నాయి. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా తిరువనంతపురంలోని దేవస్థాన మండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం కూడా పలువురు భక్తులు ధర్నాకు దిగారు.

చర్చలకు పిలిచిన ప్రభుత్వం…

ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారులతో చర్చించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధపడింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్.. పూజారులను చర్చలకు పిలవగా, వారు అందుకు విముఖత వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పుపై మొదట రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే ముఖ్యమంత్రితో మాట్లాడుతామని ఆలయ ప్రధాన పూజారి మోహనారు కందారౌ వ్యాఖ్యానించారు.

పూజారులది అదే పాట…

ప్రభుత్వం ఈ విషయంలో ఏదీ తేల్చనంత వరకు తాము మద్దతివ్వమని, అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తే అందులో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, రుతుక్రమం వచ్చే స్త్రీలు కూడా ఆలయంలోకి ప్రవేశిస్తారని, ఇది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, సన్నిధి ఆచారాలు దెబ్బతింటాయని, అలాగే శబరిమలలో 600 మంది మహిళా పోలీసులను నియమిస్తామని ప్రకటించారని, ఇవన్నీ కూడా ఆలయ సంస్కృతికి భిన్నంగానే జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విపక్షం సుముఖంగానే ఉన్నా…

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్ష కాంగ్రెస్‌ కూడా సుముఖత వ్యక్తం చేసింది. నిజానికి కేరళలోని లెఫ్ట్ పార్టీలపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. ప్రస్తుత లెఫ్ట్ ప్రభుత్వం కూడా దానికి తగినట్లే ఈ విషయంలోను వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అమలుపై విస్తృత చర్చ జరగాలని, ప్రజాభిప్రాయం కూడా స్వీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

- Advertisement -