కీలక వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ: ఇక లోన్లు చీప్

12:53 pm, Thu, 7 February 19
RBI reduced repo rate

rbi

ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) తీపి కబురు అందించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీరేట్ల తగ్గింపుపై నలుగురు సభ్యులు సానుకూలంగా స్పందించగా.. ఇద్దరు వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచి వృద్ధిరేటును మెరుగుపరచాలన్న ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం ఉంది. కీలక వడ్డీరేట్ల తగ్గింపు అనేది కొత్త ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో మొదటి నిర్ణయం కావడం గమనార్హం.

ఆర్బీఐ సమీక్షలో కీలక నిర్ణయాలు

రెపో రేటును 6.5శాతం నుంచి 6.25శాతానికి తగ్గించింది. రివర్స్‌ రెపో రేటును 6శాతానికి, బ్యాంకు రేటును 6.5శాతానికి తగ్గించింది. గతంలో 25 బేసిస్ పాయింట్లు రెపో రేట్ పెంచిన ఆర్‌బీఐ… ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్ వర్గాలకు శుభవార్తే అని చెప్పవచ్చు. తాజా నిర్ణయంతో అప్పులు కూడా తక్కువ వడ్డీరేటుకే లభించే అవకాశం ఉంది.

కాగా, మార్చి త్రైమాసికంలో ద్రవ్యల్బోణం 2.8శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.2-3.4శాతంగా, ఆ తర్వాత మూడు నెలలు 3.9శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4శాతంగా ఉండవచ్చని అంచనా.