పాపులారిటీ: ఆ రెండు వర్గాల్లో మోడీని మించిపోయిన రాహుల్!

Rahul Gandhi is a more popular choice for the PM's post than PM Narendra Modi,

న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రజల్లో క్రమంగా పాపులారిటీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఎస్సీ, ముస్లిం వర్గాల్లో ఎక్కువ మంది రాహుల్ గాంధీనే తదుపరి ప్రధాని కావాలని కోరుకుంటుండటం గమనార్హం. ఈ మేరకు తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాని పీఠం ఎక్కేదెవరంటూ ఇప్పటికే కొన్ని సంస్థలు సర్వేలు చేపట్టాయి. ఇండియా టుడే చేపట్టిన పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(పీఎస్‌ఈ) సర్వేలో.. ఎస్సీ, ముస్లిం వర్గాల ప్రజల్లో ఎక్కువ మంది రాహుల్‌కే మొగ్గుచూపుతున్నట్లు తేలింది.

ఎస్సీ ఓటర్లలో 44శాతం మంది రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటుండగా.. 41శాతం మంది నరేంద్ర మోడీ మళ్లీ రావాలని ఆశిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక ముస్లింలలో సగానికి పైగా ఓటర్లు రాహుల్‌ను తదుపరి ప్రధానిగా చూడాలనుకుంటున్నారట. 61శాతం ముస్లిం ఓటర్లు రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

ఇక కేవలం 18శాతం ముస్లిం ఓటర్లు మాత్రమే నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నట్లు పీఎస్‌ఈ సర్వే తేల్చింది. అయితే, మొత్తంగా చూసినట్లయితే మాత్రం రాహుల్‌ కంటే మోడీకి పాపులారిటీ ఎక్కువగా ఉంది.

మోడీని కోరుకుంటున్నవారే అధికం..

తదుపరి ప్రధానిగా మోడీకి 52 శాతం ప్రజల మద్దతు రాగా.. రాహుల్‌కు కేవలం 33 శాతమే మద్దతు లభించింది. జనరల్‌ కేటగిరిలో రాహుల్‌ ప్రధాని కావాలని కేవలం 15శాతం ఓటర్లు మాత్రమే కోరుకోగా.. మోడీకి 72 శాతం మద్దతు పలకడం గమనార్హం.

మహిళా ఓటర్లు కూడా రాహుల్‌ కంటే ఎక్కువగా మోడీకే మొగ్గుచూపుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. కాగా, పుల్వామా దాడి తర్వాత రెండోసారి ఉగ్రస్థావరాలపై దాడులు చేయడంతో మోడీ పాపులారిటీ మరింత పెరిగిందని మరో సర్వే తేల్చింది.