- Advertisement -

న్యూఢిల్లీ:బీజేపీ అనూహ్య నిర్ణయంతో మంగళవారం జమ్మూ కశ్మీరు ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. పీడీపీతో మూడేళ్ల మూడు నెలల బంధానికి రాం రాం చెప్పింది. భాగస్వామ్య పక్షానికి ఒక్క మాట కూడా చెప్పకుండా.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కనీస సమాచారం ఇవ్వకుండా.. నేరుగా గవర్నర్‌ను కలిసి మద్దతు ఉపసంహరణ లేఖ ఇచ్చేసింది. దీంతో సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయక తప్పలేదు.
కశ్మీరులో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. పీడీపీ ప్రభుత్వం ఉన్నపళంగా కూలిపోవడంతో గవర్నర్ ఎన్ఎస్ వోహ్రా చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజముద్ర వేశారు. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధిస్తూ జారీ చేసిన సిఫార్సు ప్రతిని కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు.
పీడీపీతో ఇక కొనసాగలేం: రాం మాధవ్
ముఖ్యమంత్రి మెహబూబాకు గవర్నర్ ‘సమాచారం ఇచ్చిన’ తర్వాత బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముఫ్తీ ప్రభుత్వంలో తామిక ఏమాత్రం కొనసాగలేమని తేల్చి చెప్పారు. రెండు పార్టీల మధ్య సంధి కుదిర్చి.. మూడేళ్లపాటు జమ్మూ కశ్మీరులో చక్రం తిప్పిన రాంమాధవే స్వయంగా పీడీపీకి కటీఫ్ చెప్పేసినట్లు ప్రకటించడం విశేషం. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీరులో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ ఇప్పటికే పీడీపీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. దీంతో.. జమ్మూ కశ్మీరులో గవర్నర్ పాలన అనివార్యమైంది.
- Advertisement -