పెళ్లాడి భార్యని వదిలేస్తారా?: ఎన్నారై భర్తలపై కేంద్రం కొరడా, 45 మంది పాస్‌పోర్ట్‌లు రద్దు…

Indian_wedding

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకొని ఆ తర్వాత భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించింది కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ. భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులు రద్దు చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు.

ఇటీవల కాలంలో ఎన్నారై పెళ్లిళ్లలో అనేక మోసాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుని అమ్మాయిని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ వేధింపులకు పాల్పడటం.. లేదా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను తమతో తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేయడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు..

ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ సంయుక్తంగా ఓ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించగా.. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. అయితే అప్పటి వరకు వీరిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్‌ నోడల్‌ ఏజెన్సీను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఈ ఏజెన్సీ భార్యలను విడిచి పెట్టిన ఎన్నారై భర్తలపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. అంతేగాక, ఇప్పటివరకు అలాంటి 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను విదేశాంగ వ్యవహారాల శాఖ రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు.

చదవండి: భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత! పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకున్న జంట!