ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఈ మధ్యాహ్నం షేక్‌పురా రైల్వే క్రాసింగ్ వద్ద రైలు, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో అత్యధికులు సిక్కు యాత్రికులే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
రైలు, బస్సు ఢీకొన్న ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిక్కు యాత్రికులు నంకానా సాహెబ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు.
బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. మరోవైపు, భారత ప్రధాని మోదీ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు.
పాకిస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో సిక్కు యాత్రికులు మృతి చెందిన విషయం తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. వారి కుటుంబాలు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొంటూ ట్వీట్ చేశారు. క్షతగాత్రులైన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Pained by the tragic demise of Sikh pilgrims in Pakistan. My thoughts are with their families and friends in this hour of grief.
I pray that those pilgrims injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) July 3, 2020