రిలయన్స్ నుంచి మరికాసేపట్లో సంచలన ప్రకటన.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశం!

10:16 am, Mon, 12 August 19

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 42వ వార్షిక సర్వసభ్య సమావేశం నేడు జరగనుంది. ఈ సందర్భంగా అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నేటి సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ముఖ్యంగా జియో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గిగాఫైబర్ సర్వీస్ సేవలను వాణిజ్యపరంగా నేడు ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గిగాఫైబర్ సేవలను పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకే కనెక్షన్‌తో మూడు సేవలు బ్రాండ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌లు లభిస్తాయి.

కనీస చార్జి రూ.600గా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ సేవలను పొందాలంటే తొలుత రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సేవలు వద్దనుకున్నప్పుడు ఈ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. గిగాఫైబర్ సేవలతోపాటు ఇదే సమావేశంలో జియో ఫోన్ 3ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

జియోఫోన్ 2 కంటే ఇది మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగిస్తారు. యూట్యూబ్‌‌లో ‘ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్’, జియో ఛానల్స్‌లో ముకేశ్ ప్రసంగాన్ని వీక్షించొచ్చు. ఆర్ఐఎల్, జియో ఫేస్‌బుక్ పేజ్‌లలోనూ ప్రత్యక్షంగా చూడొచ్చు.