పాటియాలా: బతుకు దెరువు కోసం చాట్ బండిని నడుపుతూ జీవనం సాగిస్తూన్న ఓ చాట్‌వాలా వద్ద ఏకంగా రూ.1.2 కోట్ల నగదు లభ్యమైంది. ఈ సంఘటన పంజాబ్‌లోని లుథియానా నగరంలో జరిగింది. ఓ వ్యక్తి పటియాలా ప్రాంతంలో చాట్ బండిని నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చాట్‌వాలా వద్ద లెక్కలోకి రాని దాదాపు రూ.1.2 కోట్ల రూపాయల నగదు లభ్యమైంది.
సదరు చాట్‌వాలా రెండేళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో అతడిపై ఐటీ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో వారు అతడి నివాసంపై దాడులు జరిపి.. అతడి వద్ద ఇంత భారీ మొత్తంలో నగదును కనుగొన్నారు.
కొంతకాలంగా ఐటీ అధికారులు పటియాలా ప్రాంతంలోని దుకాణాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. చాట్ బండిని నడుపుతున్న వ్యక్తికి అదే ప్రాంతంలో మరికొన్ని దుకాణాలు ఉన్నాయని, వాటిని కూడా అతనే నడుపుతున్నాడని తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిపై ఓ కన్నేసి ఉంచారు. అతనికి సంబంధించిన దుకాణాల వివరాలను ఆరాతీయగా రియల్ ఎస్టేట్‌లోనూ అతను లక్షల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఆ చాట్‌వాలా నివాసంలో దాడులు నిర్వహించగా రూ.1.2 కోట్లు బయటపడ్డాయి. ‘’మేం ఇప్పటివరకు చేసిన దాడుల్లో చిరు వ్యాపారులే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసింది. అందుకే పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కొక్కరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నాం..’’ అని ఓ ఐటీ అధికారి వెల్లడించారు.