వావ్.. రూ.899కే ఫ్లయిట్ టిక్కెట్.. ఆఫర్ కేవలం 3 రోజులే!

indigo runway sale

న్యూఢిల్లీ: తక్కువ ధరలో విమాన టిక్కెట్లు కోరుకునేవారికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. తాజాగా ‘రన్‌వే సేల్’ ఆఫర్ కింద రూ.899కే విమాన టిక్కెట్ ఆఫర్ చేస్తోంది. అయితే ఇది దేశీయ(డొమెస్టిక్) ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక విదేశీ (ఇంటర్నేషనల్) ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.3,399 నుంచి ప్రారంభమవుతోంది.

ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఇండిగో తాజా ఆఫర్ ‘రన్ వే సేల్’ మార్చి 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మార్చి 19 – సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ఎప్పుడైనా ఇండిగో విమానంలో ప్రయాణించవచ్చు. కాకపోతే ఈ డిస్కౌంట్ ఆఫర్ సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఇండిగో ‘రన్ వే సేల్’ ఆఫర్‌లో భాగంగా ఢిల్లీ-బెంగళూరు టిక్కెట్ ధ రూ.2,899, ఢిల్లీ-భువనేశ్వర్ టికెట్ ధర రూ.3,199గా, ఢిల్లీ-కోల్‌కతా టికెట్ రూ.2,899గా, ఢిల్లీ-చెన్నై టికెట్ ధర రూ.2,799గా, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.2,399గా ఉంది. ఇక ఢిల్లీ-దుబాయ్ విమాన టికెట్ ధర రూ.6,499గా, ఢిల్లీ-ఫుకెట్ టిక్కెట్ ధర రూ.8,199గా, కొచ్చి-దుబాయ్ టిక్కెట్ ధర రూ.5,799గా ఉంది.

అలాగే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఎయిర్‌పోర్ట్ చార్జీలకు, ప్రభుత్వ పన్నులకు వర్తించదని, కేవలం నాన్ స్టాప్ ఫ్లయిట్లకు మాత్రమే వర్తిస్తుందని, అలాగే ఈ ఆఫర్ ఇతర స్కీమ్‌లకు, ప్రమోషన్ ఆఫర్లకు వర్తించదని ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇంకా ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకునే ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాదారులకు 20 శాతం వరకు అంటే గరిష్టంగా రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది. అలాగే మొబిక్విక్ యూజర్లు కూడా 15 శాతం అంటే గరిష్టంగా రూ.800 వరకు సూపర్‌క్యాష్‌ను సొంతం చేసుకోవచ్చు.