కేరళ.. మాటిమాటికీ ఎందుకిలా..?

kerala-floods
- Advertisement -

kerala-floods1

94 ఏళ్లలో కనీవిని ఎరుగని కరవు.. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీళ్లు లేవు.. చుట్టూ నీళ్లున్నా .. గొంతు నింపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా లేని దుస్థితి.. ఇప్పటివరకు 10 లక్షలమంది నిరాశ్రుయులయ్యారు.. విద్యుత్కేంద్రాలు మునిగిపోయాయి.. సాయంత్రమవుతుంటే చాలు.. గుండెలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అనుకుంటూ కాలం గడుపుతున్నారు.

ఎందుకంటే చుట్టూ చిమ్మ చీకటి.. ఎటు వైపు నుంచి ఏ ముప్పు ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇంకా రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు. పొంగి ప్రవహిస్తున్న కొండవాగులు.  అసలే వారు అక్కడక్కడా ఇళ్లు కట్టుకొని నివసిస్తుంటారు.. ఇలాంటి ఆపద సమయంలో ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

కేరళ వాసులు ఎక్కువగా గల్ఫ్, ఇతర దేశాల్లో నివసిస్తారు. 70 శాతం కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా విదేశాల్లో ఉంటుంటారు. అక్కడ్నించి వారు పంపించే డబ్బే ఇక్కడి వారికి జీవనాధారం. పొట్ట చేత పట్టుకొని .. తమ వారికోసం జీవితాలు త్యాగం చేసి అక్కడికెళ్లిన వారు.. తమ వారు ఎక్కడ ఉన్నారో తెలియక, అక్కడ్నించి రాలేక అల్లాడిపోతున్నారు.

చుట్టుపక్కల వాళ్లకు ఫోన్లు చేద్దామా అంటే మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థే కుప్పకూలిపోయింది. కేవలం మీడియా ప్రతినిధుల సమాచారంతోనే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అసలు కేరళలో మాటిమాటికీ సంభవించే ఈ విలయానికి కారణాలేమిటి?

‘కేరళ ఎందుకిలా’ అయ్యింది?

1924లో వచ్చిన వరదలకు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 3,368 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.  2018, ఆగష్టు 19 నాటి వర్షాల్లో మృతుల సంఖ్య … 357.  వర్షపాతం .. 1,606 మిల్లీమీటర్లు. ఆనాటి వరదల నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ఈరోజు ఈ పరిస్థితికి కారణమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేరళ మాటిమాటికి ఇలా అతలాకుతలం అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
వాటిలో మానవ తప్పిదాలే ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అలాగే నదుల నిర్వహణలో లోపాలు .. పర్యావరణ సమతుల్యత పాటించకపోవడం.. కేరళ టూరిజం ప్లేస్ అంటూ గొప్పలు చెప్పుకోవడం.. ఆ వచ్చిన పర్యాటకులు విచ్చలవిడిగా వదిన ప్లాస్టిక్ వ్యర్థాలు ..సరైన నిర్వహణ లేకపోవడం.. మరో ముఖ్యమైన కారణం.. అక్కడి కమ్యూనిస్టు పాలకులు ప్రముఖ హిందూ దేవాలయాల నిర్వహణపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం.

ఇలాంటి ఎన్నో కారణాలు నేడు కేరళను నిండా ముంచేశాయి.. అయితే ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలు స్పందిస్తున్న తీరు మాత్రం .. మన దేశ సమైక్యతకు అద్దం పడుతోంది.. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందిస్తున్నారు.. చిరు ఉద్యోగి సైతం రూ .1000 సాయం చేసి.. ఔరా అనిపిస్తున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో…

94 ఏళ్లలో  కనీవినీ ఎరుగని రీతిలో ఈ వరదల్లో కేరళ చిక్కుకుంది. 1924లో లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. వరద సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయి.  వందలాది సహాయక బృందాలతో పాటు  బోట్లు, హెలికాప్టర్లను కేరళకు తరలించారు. ఇంకా చాలామంది ప్రజలు ఇళ్లలో, భవనాలపైన చిక్కుకుపోయి ఉన్నారు.

కేరళలో నివాసం ఉండే ప్రజల ఇళ్లు అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. దాంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఇంకా రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన కనిపిస్తుండటంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఆందోళనగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వరద ప్రభావిత ప్రాంతాల మీదుగా హెలికాప్టర్‌లో పర్యటించారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అధికారులతో సమీక్షించారు. తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు.

సోషల్ మీడియా .. సేవ

రాష్ట్రంలో గత వందేళ్లలో సంభవించిన అత్యంత భారీ వరదలు ఇవేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఎక్కడికక్కడ వేల సంఖ్యలో అత్యవసర సహాయక శిబిరాల్లో దాదాపు 2.14 లక్షల మంది ఉంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. చుట్టుపక్కల రోడ్లన్నీ జలదిగ్బంధం కావడంతో కేవలం ఒక్క గ్రామంలోనే 10 వేల మంది నీటిలో చిక్కుకుపోయారని అంటున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో సోషల్ మీడియా కేరళ ప్రజలకు ఆసరాగా నిలిచింది. చాలామంది తాము ఎక్కడ ఉన్నారో.. తమకు తాగు నీరు, ఆహరం కావాల్సినవారు సోషల్ మీడియా ఆధారంగా కోరుతున్నారు. వెంటనే దాతలు, దగ్గరలో ఉన్నవారు, సహాయ బృందాలు తక్షణం అక్కడకు వెళ్లి సహాయ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ వెళ్లలేని పరిస్థితి ఉంటే హెలికాఫ్టర్ల ద్వారా వెళుతున్నారు.

ముందు కరెంట్ ఇవ్వగలిగితే .. బాధితులు అందరు ఫోన్లు రీఛార్జి చేసుకుంటే .. సహాయ బృందాల పని ఇంకా సులువు అవుతుందని భావిస్తున్నారు.. ఎందుకంటే గూగుల్ సెర్చ్ నొక్కితే చాలు ఎవరు ఎక్కడ ఉన్నారో పట్టుకోవచ్చునని భావిస్తున్నారు. కొందరు పడుకొని ఉన్నారు. ఏంట్రా చల్లగా ఉందని చూసేసరికి పీకల లోతు నీళ్లలో ఉన్నట్టు కొందరు పేర్కొన్నారు. వీధిలోవాళ్లు పెద్ద పెద్ద తాళ్లను ఏర్పాటు చేశారని, వాటి సాయంతో రోడ్డు దాటి బస్సెక్కి గ్రామం నుంచి బయటపడినట్లు కొందరు తెలిపారు. కేరళ వాణిజ్య రాజధాని  కొచ్చిలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని రైలు మార్గాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

 

- Advertisement -