బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర భావోద్వేగానికి గురయి కన్నీళ్లు పెట్టుకున్నారు. జేడీఎస్ నేతలు శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. కుమారస్వామి ముఖ్యమంత్రి అయినందుకు జేడీఎస్ నేతలు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కుమారస్వామి మాట్లాడుతూ… తాను ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ నేతలంతా తమ అన్నో, తమ్ముడో సీఎం అయినట్లు సంతోషపడిపోతున్నారని, కానీ తాను మాత్రం సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు.
సంకీర్ణ ప్రభుత్వంలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయంటూ ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు. బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి కూడా కుమారస్వామి నిరాకరించారు. ‘‘మీ అన్నో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను మాత్రం అలా లేను.. నిత్యం నేను దిగమింగుతున్న బాధ విషం కంటే తక్కువేం కాదు, దాన్ని మీతో పంచుకోకుండా ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను..’’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అదేమి అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేవుడైతే నాకీ సీఎం పదవి ఇచ్చాడు. కానీ నేను ఎన్ని రోజులు ఈ పదవిలో ఉంటానో తెలియదు.. అది దేవుడే నిర్ణయిస్తాడు..’’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
రైతు రుణమాఫీ గురించి నెల రోజులుగా అధికారులను ఒప్పించడానికే చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. అన్నభాగ్య పథకానికి రూ.2,500 కోట్లు అదనంగా కేటాయించినా, పన్నులు భారం వేస్తున్నారని విమర్శించడం బాధాకరమని అన్నారు.
సీఎం వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువ…
కుమారస్వామి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి మా సీఎం కాదంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొడుగు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుమారస్వామిపై ఓ వీడియో పోస్ట్ చేశారు. జిల్లాలో రోడ్లు కొట్టుకుపోయినా సీఎంకు ఏ మాత్రం చింతలేదని అందులో విమర్శించాడు. అలాగే తమ రుణాలను మాఫీ చేయడంలో కుమారస్వామి విఫలమయ్యారని కోస్తా జిల్లాల మత్స్యకారులు కూడా మండిపడుతున్నారు.
దేవెగౌడ ఆందోళన…
మరోవైపు తన తనయుడు, ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి ఆరోగ్యంపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడు విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 18 గంటలు పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుమారస్వామి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉందని, ఇప్పుడు ఈ ప్రభావం ఆయన ఆరోగ్యంపై తప్పకు పడుతుందని దేవెగౌడ విచారిస్తున్నారు.
#WATCH: Karnataka CM HD Kumaraswamy breaks down at an event in Bengaluru; says ‘You are standing with bouquets to wish me, as one of your brother became CM & you all are happy, but I’m not. I know the pain of coalition govt. I became Vishkanth&swallowed pain of this govt’ (14.07) pic.twitter.com/cQ8f90KkFT
— ANI (@ANI) July 15, 2018