ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ

1:03 pm, Fri, 27 September 19

ముంబై: భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంక్ జారీ చేసే రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌గా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) రెపో రేటును ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది.

ఫ్లోటింగ్ రేటు ఎంఎస్ఎంఈ రుణాలు, హోమ్ లోన్స్, రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. మార్కెట్ వడ్డీ రేటు ప్రాతిపదికన బ్యాంకులు కస్టమర్లకు రుణాలు జారీ చేయవచ్చు.

ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాల జారీ విధానాన్ని వాలంటరీ ప్రాతిపదికన ఇప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. సూక్ష, స్థూల మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఇక రేపో ఆధారిత ఫ్లోటింగ్ రేటు హోమ్‌లోన్స్‌కు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి 2019 జులై 1 నుంచి అమలులో ఉన్నప్పటికీ, వాటిలో కూడా స్వల్ప మార్పులు చేసింది. అది కూడా అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.