బెంగళూరు: ప్రస్తుతం పరారీలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. గాలి ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన హైదరాబాదులో ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి అనుచరుల ముబైల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో గాలి జనార్ధన్‌రెడ్డి కేసు గురించిన వివరాలు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
2014లో బెంగళూరులో అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ కంపెనీ ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి.. ఆ డిపాజిట్లపై 30-40 శాతం వడ్డీ ఇస్తామని హామీ కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ హామీ నిలబెట్టుకోకపోవడంతో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో 2017లో ఈడీ ఆ కంపెనీపై కేసు నమోదు చేసి.. తనిఖీలు కూడా నిర్వహించింది.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ నిర్వహకులు కొద్ది మంది ప్రముఖులను ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ ఆశ్రయించిన వారిలో గాలి జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పని చేసి పెట్టేందుకు అంబిడెంట్ కంపెనీ నుంచి ఆయన 57 కిలోల బంగారం తీసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో ఈడీ నుంచి అంబిడెంట్ కంపెనీని తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికి కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి అదృశ్యం అయ్యారు. దీంతో పోలీసులు ఆయన కోసం అటు బెంగళూరులోనూ, ఇటు హైదరాబాద్‌లొనూ గాలిస్తున్నారు.