కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కారుకు జరిమానా

4 days ago

ముంబై: ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహనం చట్టం వాహనదారుల్లో గుబులు రేపుతోంది. వేలాది రూపాయల జరిమానాలో పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికైనా జరిమానా తప్పదని పోలీసులు మరోమారు నిరూపించారు. స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కారుకే జరిమానా విధించారు.

ముంబైలోని బాంద్రా-వర్లీ ప్రాంతంలో కారును అతివేగంగా నడిపినందుకు పోలీసులు చలానా పంపారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. మోదీ వంద రోజుల పాలన గురించి వివరిస్తూ ఆయనీ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రమాదాల నివారణ కోసమే మోటారు వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చామని, ఇది తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. భారీ జరిమానాల వల్ల పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి తావుండదని అన్నారు.

కారు వేగంగా నడిపినందుకు తాను కూడా జరిమానా కట్టాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి ఎటువంటి భయం అవసరం లేదన్నారు. కాగా, కొత్త వాహన చట్టం కింద వేలాది రూపాయల జరిమానాలు  విధిస్తుండడంతో  దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.