అభినందన్ ఫొటో వాడినందుకు బీజేపీ ఎమ్మెల్యేకి ఈసీ నోటీసులు

IAF officer Abhinandan Varthaman
- Advertisement -

న్యూఢిల్లీ: అమరవీరుల, భారత జవాన్ల ఫొటోలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోస్టర్ల మీద వాయుసేన వింగ్ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఫొటోను ఉపయోగించినందుకు ఢిల్లీ బీజేపీఎమ్మెల్యే ఓమ్ ప్రకాశ్‌ శర్మకు బుధవారం ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

మోడీ ఫొటోపాటు అభినందన్ ఫొటో..

ప్రధాని నరేంద్ర మోడీ, అభినందన్‌తో పాటు ఎమ్మెల్యే ఫొటోలు ఉన్న రెండు పోస్టర్లను ఫేస్‌బుక్‌లో పెట్టడంపై ఈసీ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. అలాగే గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఓం ప్రకాశ్‌ను ఆదేశించింది.

అంతేగాక, ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి విరుద్ధమని వెల్లడిస్తూ వెంటనే ఆ రెండు పోస్టర్లను తొలగించాలని ఫేస్‌బుక్‌ను కూడా ఆదేశించింది. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన కమిషన్‌ దాన్ని వెంటనే ఫేస్‌బుక్‌ దక్షిణాసియా డైరెక్టర్‌కు పంపించింది.

కాగా, ‘అభినందన్‌ తిరిగి భారత్ రావడం ప్రధాని మోడీ సాధించిన దౌత్య విజయం’ అనే వ్యాఖ్యలు సదరు పోస్టర్లపై ఉండటం గమనార్హం. దీనిపై శర్మకు జిల్లా మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణమే ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

 

- Advertisement -