శబరిమల: అందరూ ఎదురుచూస్తోన్న అద్భుతం ఆవిష్కృతమైంది. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి. శబరిమలలోని పొన్నాంబలమేడు కొండపై సోమవారం అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనిమిచ్చారు. దీంతో లక్షలాది అయ్యప్ప భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయారు.
‘స్వామియే శరణమయ్యప్పా’.. అంటూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. మకరజ్యోతి దర్శనం కోసం సోమవారం ఉదయం నుంచీ శబరిగిరులకు భక్తులు పోటెత్తారు.
మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. శబరిలమలలో ఈ ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం పంబా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రెండురోజుల క్రితం పందళం నుంచి బయలుదేరిన స్వామి వారి తిరువాభరణాలను సాయంత్రం 6 గంటలకు శబరిమలలోని పవిత్ర పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానానికి తరలించారు. సాయంత్రం 6.30 గంటలకు దీపారాధన కార్యక్రమంతో పాటు, స్వామికి దివ్యాభరణాలు ధరింపజేసే ‘తిరువాభరణ’ ఘట్టం నిర్వహించారు.
పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో…
స్వామిని ఆభరణాలతో అలంకరించి హారతి ఇచ్చే సమయంలోనే.. ఆలయానికి ఈశాన్య దిక్కున ఉండే పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. సాయం సంధ్యవేళ ఈ మకరజ్యోతి దర్శనం వేయ జన్మల పుణ్యఫలంగా అయ్యప్ప భక్తులు భావిస్తారు. మకరజ్యోతి దర్శనమివ్వగానే భక్తులు పోటీలు పడి ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శబరిమలకు తరలి వెళ్లారు.
ఈ నెల 19వ తేదీ వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం వీలు కల్పిస్తుంది. 20న పందళ రాజవంశీకులు స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
Thiruvabharana procession enters Sabarimala temple at 6.17 PM #makaravilakku #Sabarimala pic.twitter.com/VYEqOPOUQx
— Disney (@Disney_ToI) January 14, 2019