బీఎండబ్ల్యూ కొనిచ్చిన తండ్రి.. నదిలో పారేసిన కొడుకు

1:40 pm, Sun, 11 August 19

హరియాణా: జాగ్వార్ కారు కొనిమ్మంటే బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడని తండ్రిపై చిర్రెత్తు కొచ్చిందా కొడుక్కి. తనకు ఇష్టం లేని ఆ రూ.35 లక్షల విలువ చేసే కారును తీసుకెళ్లి నదిలో పడేసి తండ్రిపై కోపం తీర్చుకున్నాడా పుత్రరత్నం. హరియాణాలో జరిగిందీ ఘటన.

యమునానగర్‌కు చెందిన భూస్వామి కుమారుడు తనకు జాగ్వార్ కారు కొనివ్వమని తల్లిదండ్రులను అడిగాడు. కొడుకు కోరికను కాదనలేని ఆ తండ్రి రూ.35 లక్షలకు పైగా విలువ చేసే బీఎండబ్ల్యూని కొనిచ్చాడు. దానిని తాళాలు కొడుక్కి ఇచ్చి అతడి కళ్లలో మెరుపు చూడాలని ఆశపడ్డాడు.

అయితే, జాగ్వార్ కొనిమ్మంటే బీఎండబ్ల్యూ తెస్తావా? అని అంతెత్తున ఎగిరిన ఆ పుత్రరత్నం దానిని నేరుగా నది వద్దకు తీసుకెళ్లి ఆ ప్రవాహంలో పడేశాడు. దానిని వీడియో కూడా తీశాడు. కారు అలా నదిలో ప్రవహిస్తూ నది మధ్యలో చిక్కుకుంది.
ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో.. కారును మళ్లీ బయటకు తేవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక గత ఈతగాళ్ల సాయంతో ఎట్టకేలకు దానికి బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.