అర్ధరాత్రి అడవిలో ఏడాది చిన్నారి.. అసలు విషయం తెలిసి అందరూ షాక్!

7:47 am, Tue, 10 September 19

ఇడుక్కి: వేగంగా వెళ్తున్న వాహనం నుంచి ఏడాది వయసున్న చిన్నారి కిందపడింది. ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు అలానే వెళ్లిపోయారు. కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ పర్యాటక ప్రాంతంలో జరిగిందీ ఘటన.

రాత్రివేళ వేగంగా వెళ్తున్న ఓ ఎస్‌యూవీ నుంచి చిన్నారి కిందపడడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, చిన్నారి ఎలా కిందపడిందన్నది మిస్టరీగా మారింది. కిందపడిన చిన్నారి రోడ్డుపై అటూఇటూ పాకుతూ కనిపించింది.

అంత వేగంలో కిందపడినా చిన్నారికి ఏమీ కాకపోవడం గమనార్హం. ఆ దారి గుండా ప్రయాణించిన కొందరు వాహనదారులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వెతికారు.

కనిపించకపోవడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి రోడ్డుపక్కన ఉన్నట్టు గుర్తించి రక్షించారు. అయితే, వాహనం నుంచి కిందపడినట్టు తెలుసుకుని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.

మరోవైపు, ఏడాది వయసున్న తమ చిన్నారి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ చిన్నారిని వారికి అప్పగించారు.