కరోనాతో నిన్న ఒక్క రోజే దేశంలో 3,645 మంది మృత్యువాత

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మహమ్మారి ఉద్ధృతి కొన‌సాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది.  నిన్న‌ కొత్త‌గా 3,79,257 మంది ప్రాణాంతక కొవిడ్ బారినపడ్డారు.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం… నిన్న‌ 2,69,507 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం  కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది.

గత 24 గంట‌ల్లో 3,645 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఫలితంగా మృతుల సంఖ్య 2,04,832  కు పెరిగింది.  కరోనా బారి నుంచి ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకున్నారు.

30,84,814  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,00,20,648 మంది ఇప్పటి వరకు కరోనా టీకాలు తీసుకున్నారు.

దేశంలో నిన్నటి వరకు మొత్తం  28,44,71,979  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,68,190 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.