సుప్రీం సంచలన తీర్పు: మేజర్లయితే చాలు.. పెళ్లి చేసుకోకున్నా కలిసి ఉండొచ్చు!

- Advertisement -

న్యూఢిల్లీ: మేజరైన యువతీ యువకులకు పెళ్లి చేసుకోకున్నాకలిసి జీవించే హక్కుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వివాహంతో సంబంధం లేకుండానే తమకు నచ్చిన వారితో యుక్తవ వయస్సున్న యువతీ యువకులు కలిసి ఉండవచ్చని స్పష్టం చేసింది.

వివాహం కాకుండా యువతీ యువకులు కలిసి ఉండే సంప్రదాయం మన దేశంలోనే తక్కువ. ఈ తరహా సంస్కృతి విదేశాల్లో ఎక్కువ.  అయితే ఇప్పుడిప్పుడే ఈ తరహ సంస్కృతి మన దేశంలోనూ చోటుచేసుకుంటోంది.  సహజీవనాన్ని కొన్ని చట్టసభలు కూడా గుర్తించాయి.

సుప్రీం కోర్టు కూడా చట్టబద్దమైన వివాహ వయస్సు వచ్చిన తర్వాత యువతీ యువకులు కలిసి ఉండొచ్చని తాజాగా అభిప్రాయపడింది.  ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్స్‌'(సహజీవనం)ను శాసన సభ గుర్తించిందని పేర్కొంది.

చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్‌ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందంటూ సంచలన తీర్పు వెలువరించింది.

నందకుమార్, తుషారా కేసులో…

కేరళకు చెందిన నందకుమార్‌ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్‌లు అయినప్పటికి నందకుమార్‌కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని​ ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్‌, తుషారాల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషారాను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసును విచారించిన సుప్రీంకోర్టు వీరి వివాహం చెల్లుబాటు అవుతోందని తీర్పును వెలువరించింది.

ఆ నిబంధన ప్రకారం చెల్లుబాటు…

నందకుమార్, తుషారా కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఆశోక్ భూషన్ నేతృత్వంలో బెంచ్‌ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషారా ఇద్దరూ హిందూవులే అయినందున వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారంగా వీరి వివాహం చెల్లుబాటు అవుతోందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.  వీరిద్దరూ కూడ మేజర్లు అయినందున కలిసి జీవించే హక్కుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

హదియా కేసు ప్రస్తావన…

ఈ సందర్భంగా కేరళకు చెందిన హదియా కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మేజర్లుగా ఉన్న హదియా కేసులో వివాహం చెల్లుబాటు అవుతోందని ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా బెంచిలోని న్యాయమూర్తులు ప్రస్తావించారు. అలాగే తుషారా, నందకుమార్‌ల వివాహనికి కూడ ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  నందకుమార్‌కు ఈ నెల 31 వ తేదికి 21 ఏళ్ళు నిండుతాయి.

 

- Advertisement -