శ్రీదేవి పేరిట రూ.240 కోట్ల బీమా పాలసీ! పైగా దుబాయ్‌లో మరణిస్తేనే…

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఆమె మరణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సునీల్‌ సింగ్‌ అనే వ్యక్తి  దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌‌లతో కూడిన బెంచ్‌ కొట్టేసింది.

శ్రీదేవి పేరిట ఉన్న బీమా పాలసీలకు సంబంధించి ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే చెల్లింపులు జరుగుతాయని పిటిషనర్‌ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట రూ.240 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీ ఉందని, ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్మును విడుదల అవుతుందని, అలాంటి షరతులు ఉన్నాయంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు.

అంతేకాదు, శ్రీదేవి హఠాన్మరణంపై అనుమానాలు కూడా ఉన్నాయని, 5.7 అడుగుల పొడవున్న శ్రీదేేవి కేవలం 5.1 అడుగుల బాత్‌టబ్‌లో ఎలా పడిపోతారన్న ప్రశ్న కూడా లేవనెత్తారు. ​శ్రీదేవి మృతికి సంబంధించి దుబాయ్‌ పోలీసులు చేపట్టిన ఆమె వైద్య, దర్యాప్తు పత్రాలన్నింటినీ భారత్‌కు రప్పించాలని, స్వతంత్ర ఏజెన్సీతో మళ్లీ దర్యాప్తు చేయించాలని న్యాయవాది వికాస్‌ సింగ్‌ కోరారు.

అనుమానాస్పద పరిస్థితుల్లోనే శ్రీదేవి మరణించారని వికాస్‌ సందేహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై విచారణను కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో సునీల్‌ సింగ్‌ మార్చి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లోని బాత్‌రూమ్‌ టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి మరణించారని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -