కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకే.. సంస్థాగత ఎన్నికల తర్వాత నిర్ణయం!

6:59 am, Sat, 14 September 19

న్యూఢిల్లీ: వచ్చే సంస్థాగత ఎన్నికల తర్వాత ప్రియాంకా గాంధీకే కాంగ్రెస్‌ పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల సమావేశంలో ఒకరు ఈ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది.

సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌, రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లట్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు వ్యూహరచనపై చర్చించారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, మంచి పరిపాలన ద్వారా ప్రజల అభిమానం చూరగొనాలని సోనియా సూచించారు.

కొందరు ముఖ్యమంత్రులు మాట్లాడుతూ రాహుల్‌, ప్రియాంకా గాంధీల్లో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టమని చెప్పినట్లు సమాచారం.

 పార్టీలో ప్రేరక్‌లను నియమించాలన్న ప్రతిపాదనను సోనియా తోసిపుచ్చారు. ప్రస్తుతమున్న సమన్వయకర్త అనే పదానికే ఆమె ఓటు వేశారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అధ్యక్షతన ఏఐసీసీలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.