అసలు కాశ్మీర్ గొడవేంటి? అదెలా విడిపోయింది? భారత్‌పై పాకిస్తాన్‌కి ఎందుకింత కక్ష?

kashmir-problem, newsxpress.online

kashmir-the-burning-fire, newsxpress.online

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య వైరం ఈనాటిది కాదు. దేశ విభజన నాటినుంచే ఉంది. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంశం ‘కాశ్మీర్’. అసలు కాశ్మీర్ ఎవరిది? ఎప్పుడు విడిపోయింది? కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి ఎందుకింత పట్టుదల?

పాకిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భరత్‌పైకి ఎందుకు ఉసిగొల్పుతోంది? పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ రెండు దేశాల నడుమ యుద్ధమే గనుక జరిగితే పర్యవసానం ఎలా ఉంటుంది?

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నిత్యం మండుతున్న అగ్నిగోళం కాశ్మీర్. నిత్యం సైనిక పహారా నడుమ ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో కాశ్మీర్ ఒకటి. అయితే కాశ్మీర్‌లో గొడవలు, పేలుళ్లు, మరణాలు కొత్త కాదు. గత ఏడాది ఇక్కడి వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో.. సాధారణ ప్రజానీకం, మిలటెంట్లు, భారత సైనికులు కలిపి దాదాపు 500 వరకు మృత్యువాత పడ్డారు.

ఇటీవల పుల్వామా జిల్లాలోని అవంతిపురలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్రవాది కారుబాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడి మళ్లీ కాశ్మీర్‌లో అస్థిరత్వానికి తెరలేపిందనే చెప్పాలి. ఎందుకంటే, గత మూడు దశాబ్దాల్లో భారత సైన్యంపై ఇంత తీవ్రమైన దాడి జరగలేదు. తాజా దాడిలో 46 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి.

పుల్వామా ఆత్మాహుతి దాడి తరువాత దేశంలో కొన్నిచోట్ల నిరసన జ్వాలలు రేగాయి. కొంతమంది నిరసనకారులు విద్యార్థులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దాడులు కూడా చేశారు. మరోవైపు కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. పుల్వామా దాడి పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న మిలిటెంట్ సంస్థ జైషే మహ్మద్ పనేనని, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే ఉన్నారని భారత ప్రభుత్వం చెబుతుండగా, పాకిస్తాన్ మాత్రం ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని పాతపాటే పాడుతోంది.

ఇప్పటి వరకు రెండుసార్లు యుద్ధం…

భారత్, పాక్ నడుమ ఇప్పటి వరకు రెండుసార్లు యుద్ధం జరిగింది. 1947లో తొలిసారి, 1965లో రెండోసారి. ఆ తరువాత కాశ్మీర్ వివాదం నేపథ్యంలో ఎన్నో సాయుధ దాడులు, మిలిటెంట్ దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పుడల్లా కాశ్మీరీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోయింది, మరోవైపు రాజకీయ అస్థిరత నెలకొంది. ఇది చివరికి కాశ్మీర్‌లో ఉగ్రవాదం పురుడుపోసుకునే పరిస్థితికి దారితీసింది.

కాశ్మీర్‌లో ముస్లింలదే మెజారిటీ…

నిజానికి ఆఖండ భారతం.. హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికగా.. ఇండియా, పాకిస్తాన్‌ దేశాలుగా విడిపోక మునుపే కాశ్మీర్ ఎవరిదనే విషయంలో వేడిగా వాడిగా చర్చలు జరిగాయి. అప్పడు కాశ్మీర్ ప్రత్యేక రాజ్యంగా ఉండేది. దానిని హిందువైన మహారాజా హరిసింగ్ పరిపాలిస్తుండేవాడు.

జమ్మూ కాశ్మీర్‌లో 60 శాతానికి పైగా ముస్లింలు నివసించేవారు. దీంతో కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ అది ఏమాత్రం ఇష్టం లేదు.

విలీనానికి అవకాశమిచ్చిన పటేల్…

బ్రిటీష్ వాళ్లపై పోరాడి భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించుకునే నాటికి కాశ్మీర్, హైదరాబాద్ దక్కన్, జునాగఢ్ తదితర ప్రాంతాలు చిన్న చిన్న సంస్థానాలుగా స్వతంత్ర పాలన సాగిస్తుండేవి. ఇక భారత్‌కు స్వాతంత్యం సిద్ధిస్తుందనగా.. 1947 జూన్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాలకు ఓ అవకాశం ఇచ్చారు. భారత్ లేదా పాకిస్తాన్.. ఏ దేశంలో మీ రాజ్యాలను విలీనం చేస్తారో తేల్చుకోమని ఆయా సంస్థానాల పాలకులకు చెప్పారు.

భారత్‌వైపే కాశ్మీర్ రాజు మొగ్గు…

తమను పాకిస్తాన్‌లో విలీనం చేసుకోవాలంటూ జునాగఢ్ నవాబు చేసిన అభ్యర్థనను పాకిస్తాన్ స్వీకరించింది. ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతం కాశ్మీర్‌‌ను కూడా తమ దేశంలో విలీనం చేసుకోవాలని అనుకుంది. కానీ అప్పటి కాశ్మీర్ మహారాజు హరిసింగ్ మాత్రం భారత్‌లో విలీనం కావడానికే ఇష్టపడ్డారు.

1947 అక్టోబర్ 26న స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నివాసంలో జరిగిన సమావేశానికి మెహర్ చాంద్ మహాజన్ అనే అధికారిని కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ తన దూతగా పంపించి.. పాకిస్తాన్‌లో కలవడం తమకు ఇష్టం లేదని, భారత్‌లోనే విలీనం అవుతామని తెలిపారు.

భగ్గుమన్న పాకిస్తాన్…

కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని మహారాజా హరిసింగ్ ఎప్పుడైతే భారత ప్రభుత్వానికి వర్తమానం పంపించారో.. పాకిస్తాన్ భగ్గుమంది. కాశ్మీర్ తమదేనని, అవసరమైతే ఈ విషయంలో భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని తెగేసి చెప్పడమేకాదు.. కాశ్మీర్‌వైపుగా తన సైనిక పటాలాన్ని కూడా నడిపించింది.

దీంతో తమను కాపాడాలని, అండగా భారత సైన్యాన్ని పంపించాలంటూ కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. దీంతో భారత సైన్యం కూడా కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ కోసం ఇరు దేశాల నడుమ రెండేళ్లపాటు భీకర యుద్ధం జరిగింది.

ఇలా విడిపోయింది…

ఆ తరువాత రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. కాశ్మీర్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించడానికి మాత్రం పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో కాశ్మీర్ రెండుగా విడిపోయింది. కొంత భారత్‌లోకి రాగా, మరికొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యం ఆక్రమణలోనే ఉండిపోయింది.

కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ ఇలా గొడవలు పడుతుండగా.. 1950లో చైనా తూర్పు కాశ్మీర్‌లో కొంతభాగాన్ని మెల్లమెల్లగా ఆక్రమిస్తూ వచ్చింది. ఈ ప్రాంతమే అకాయ్ చిన్.

పాక్ మద్దతుతో పుట్టుకొచ్చిన మిలిటెంట్ సంస్థలు…

1965లో కూడా భారత్, పాకిస్తాన్ నడుమ రెండోసారి యుద్ధం జరిగింది. అలాగే 1980-90 దశకం మధ్యలో కూడా మన దేశంలోని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆ సమయంలో అనేక నిరసనలు, తిరుగుబాట్లు జరిగాయి. ఫలితంగా పాకిస్తాన్ మధ్దతులో మన దేశంలోని కాశ్మీర్ భూభాగంలో కొన్ని మిలిటెంట్ సంస్థలు పుట్టుకొచ్చాయి.

ఆ తరువాత 1999లో కూడా పాకిస్తాన్ సైన్యంతో భారత్ తీవ్రంగా తలపడింది. అప్పటికే భారత్, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాల జాబితాలో ఉండడంతో ఈ పోరాటం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే…

కాశ్మీర్ వివాదంపై 1950లోనే ఐక్యరాజ్య సమితి భారత్, పాకిస్తాన్ దేశాలకు ఒక సూచన చేసింది. కాశ్మీర్‌లో ఫ్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలని, కాశ్మీర్ ఏ దేశానికి సంబంధించినది అనే విషయంలో అక్కడి ఓటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని సూచించింది. అయితే జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో.. ప్రజలు తమవైపే ఉన్నారని భారత్ ఐక్యరాజ్య సమితికి తెలిపింది.

కానీ ఇందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. కాశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు భారత్‌ను వ్యతిరేకిస్తున్నారని, కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌ పాలనను కోరుకుంటున్నారని చెబుతోంది. దీంతో కాశ్మీర్ సమస్య రోజురోజుకీ మరింత రాజుకుంటోంది!