లైవ్‌లో మహిళా రిపోర్టర్‌కు ముద్దు.. విస్తుపోయిన జర్నలిస్ట్

12:12 pm, Sat, 28 September 19

న్యూయార్క్: వార్తలు ప్రసారం చేసే సమయంలో జర్నలిస్టులు, కెమెరామెన్‌లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. లైవ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొంతమంది కొంటె పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వింత వింత ఘటనలు జరుగుతుంటాయి.

లైవ్‌లో పాల్గొన్న వారు కొట్టుకోవడం తదితర ఘటనలు చూసే ఉంటారు. మీడియా రంగంలో ఉన్న మహిళా జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది.  లైవ్‌లో రిపోర్టు ఇస్తున్న మహిళా పాత్రికేయురాలి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫలితంగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వార్త రిపోర్ట్‌ చేస్తున్న మహిళా పాత్రికేయురాలికి ముద్దు పెట్టినందుకు ఓ వ్యక్తి లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. అమెరికాకు చెందిన వేవ్‌ 3 న్యూస్‌ ఛానెల్‌లో సారా రివస్ట్ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. న్యూస్‌రూంలో ఉన్న యాంకర్‌ మరో చోట ఉన్న సారా రిపోర్టర్‌తో మాట్లాడడం ప్రారంభించింది. 

వెంటనే ఓ వ్యక్తి రిపోర్టర్‌ సారా రివస్ట్‌ చుట్టు పక్కల తిరిగాడు. కొంటె కొంటెగా సైగలు చేశాడు. వార్త గురించి వివరిస్తూ ఉన్న ఆమె అతణ్ని కనిపెడుతూనే ఉంది. అమాంతం ఈలోపు ఉన్నట్టుండి పక్క నుంచి వచ్చి ఆగంతకుడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టి పరారయ్యాడు.

ఈ సమయంలో ఆమె ఒకింత అసహనానికి గురైనా వార్త చెప్పడం మాత్రం ఆపలేదు. అనంతరం ఆ వ్యక్తిపై సారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముద్దు పెట్టిన వ్యక్తిని పోలీసులు ఎరిక్‌ గూడ్‌మ్యాన్‌గా గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.