‘అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్’: మళ్లీ అడ్డుకున్న చైనా, అమెరికా వార్నింగ్

As China Blocks Move On Masood Azhar, Newsxpressonline

న్యూయార్క్: ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన పాకిస్థాన్‌కు చైనా అండదండలు ఉన్నాయన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది డ్రాగన్ దేశం. జైషే-మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా మరోసాకరి అడ్డుకొంది.

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో భారత సైనికులపై దాడికి పాల్పడిన క్రమంలో… ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు గత ఫిబ్రవరి 27న ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దీనికి ఏవైనా అభ్యంతరాలుంటే అల్‌ఖైదా ఆంక్షల కమిటీ సభ్యులు పది రోజుల్లోగా వాటిని తెలియజేయాలి. చివరి గడియలో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా… తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రతిపాదనకు సాంకేతికంగా అడ్డు తగిలింది.

2009, 2016, 2017లోనూ ఇదే విధమైన వైఖరిని డ్రాగన్ దేశం కనబరిచింది. ఈ క్రమంలో ఏవిధంగా చూసినా అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సి ఉందనీ, ఈ విషయంలో చైనా వైఖరి తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అమెరికా వ్యాఖ్యానించింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత సాధించడానికి కూడా ఇది అడ్డుగోడగా నిలుస్తోందని పేర్కొంది.

కాగా, ‘ఈ విషయంలో చైనా తన బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగిస్తుంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలన్నదే మా అభిమతం’ అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్‌ పునరుద్ఘాటించారు. ఇటీవలే చైనా విదేశాంగశాఖ సహాయ మంత్రి కాంగ్‌ జుయాంగ్‌ పాకిస్థాన్‌ వెళ్లి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు సైనికాధికారులతోనూ మంతనాలు సాగించడం గమనార్హం.

వెనక్కి తగ్గని అమెరికా

ఇది ఇలా ఉండగా, మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. లేనిపక్షంలో శాంతి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక సమావేశం బుధవారం జరిగిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్‌ను ప్రకటించకుండా అడ్డుపడుతున్న చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అడ్డుకున్నప్పటికీ మసూద్ అజార్‌పై ఇతర కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తేల్చి చెప్పింది.