ముగిసిన ముగాబే శకం.. కన్నుమూసిన జింబాబ్వే మాజీ అధ్యక్షుడు

12:22 pm, Fri, 6 September 19

హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 95 ఏళ్ల ముగాబే ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూసినట్టు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మనంగ్వా ప్రకటించారు.

1980 నుంచి 2017 వరకు సుదీర్ఘకాలం జింబాబ్వేకు అధ్యక్షుడిగా పనిచేసిన ముగాబే అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న రొడేషియా (ప్రస్తుతం జింబాబ్వే)లో 21 ఫిబ్రవరి 1924న జన్మించారు.

దక్షిణాఫ్రికాలోని ఫోర్ట్‌హార్ విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్‌షిప్ అందుకున్నారు. ఏడు డిగ్రీలు అందుకున్న ముగాబే అనంతరం ఘనాలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. అక్కడి నేత కామే క్రుమా ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితులయ్యారు.

1960లో స్వదేశానికి తిరిగొచ్చి మరికొందరితో కలిసి జింబాంబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జానూ) పార్టీని స్థాపించారు. 1964లో జింబాబ్వే ప్రధాని ఇయాన్ స్మిత్, ఆయన ప్రభుత్వాన్ని ‘కౌబాయ్’ లుగా అభివర్ణించి జైలు పాలయ్యారు.

ఏకంగా పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. 1973లో విడుదలైన ముగాబే మొజాంబిక్ వెళ్లిపోయారు. అక్కడి నుంచే గెరిల్లా పోరాటాలు నిర్వహించారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ముగాబే ప్రధానిగా ఎన్నికయ్యారు.

1987లో ప్రధాని పదవిని రద్దుచేసిన ముగాబే అధ్యక్ష పదవిని చేపట్టారు. ముగాబే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి.

ఆకలితో ప్రజలు అల్లాడిపోయారు. అయినప్పటికీ ముగాబే ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో ఆయన పాలనపై విసుగు చెందిన ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసి 2017లో గృహనిర్బంధంలో ఉంచింది. దీంతో జానూ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మనంగ్వా జింబాంబ్వే అధ్యక్షుడయ్యారు.