సీఈవో హఠాన్మరణం.. పాస్‌వర్డ్ తెలియక ఇరుక్కుపోయిన రూ.వెయ్యి కోట్లు!

QuadrigaCX CEO Gerald Cotten died Dec. 9, 2018, in India due to complications from Crohn's disease. Now, the company he founded is embroiled in legal

quadriga ceo gerald cotten crypto

టోరంటో: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అంటే తెలుసుగా? ఇదో రకమైన డిజిటల్ నగదు. ఈ డిజిటల్ కరెన్సీపై బ్యాంకులు, ప్రభుత్వాల అదుపు, నియంత్రణ ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీ వ్యవస్థ బ్లాక్‌చెయిన్ అనే సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు శక్తివంతమైన, రహస్య సంక్షిప్త ప్రక్రియల ద్వారా జరుగుతాయి.

అయితే.. కెనడాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇటీవల భారత్‌కు వచ్చి అనూహ్యంగా హఠాన్మరణం పాలవడంతో కెనడాలో రూ.1037 కోట్ల విలువైన, క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న సొమ్ము ఇరుక్కుపోయింది. అవును కెనడాలోని క్వాడ్రిగా సంస్థ సీఈవో గెరాల్డ్ కాటన్(30) ఇటీవలే భారత్ పర్యటనకు వచ్చారు.

జైపూర్‌లో ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కాటన్‌ పేగు సంబంధ వ్యాధితో బాధపడుతూ గత డిసెంబర్ 9వ తేదీన కన్నుమూశారు.

ఇరుక్కుపోయిన రూ.వెయ్యి కోట్లు!

గెరాల్డ్ కాటన్ సీఈవోగా వ్యవహరిస్తోన్న క్వాడ్రిగా సంస్థలో పలువురికి చెందిన రూ.1037 కోట్ల విలువైన బిట్ కాయిన్లు, ఇతర డిజిటల్ ఆస్తులు ఉన్నాయి. ఈ సంస్థ క్రిప్టో కరెన్సీ నిల్వలు ‘కోల్డ్ వ్యాలెట్స్’ అనే ఆఫ్‌లైన్ ఖాతాల్లో భద్రపరిచి ఉన్నాయి. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఈ ఖాతాలను ఇలా నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ఖాతాలను వినియోగించాలంటే అందుకు పాస్‌వర్డ్ తప్పనిసరి. ఆ పాస్‌వర్డ్ సంస్థ సీఈవో గెరాల్డ్ కాటన్‌కు మాత్రమే తెలుసు. ఉన్నట్లుండి ఆయన కన్నుమూయడంతో వ్యాపార కార్యకలాపాలకు ఆయన వినియోగించే ల్యాప్‌టాప్ ఎన్‌క్రిప్ట్ అయింది.

దీంతో ఈ ల్యాప్‌టాప్ నుంచి సమాచారాన్ని వెలికితీసేందుకు క్వాడ్రిగా సంస్థ హ్యాకర్లను ఆశ్రయించింది. అయినా ఫలితం కనిపించలేదు. రుణ దాతలకు చెల్లింపులు జరిపే అవకాశం లేకపోవడంతో.. క్వాడ్రిగా సంస్థ కెనడాలోని నోవా స్కోషియా కోర్టును ఆశ్రయించింది. గెరాల్డ్ కాటన్ తన ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఎక్కడా రాసి కూడా పెట్టలేదని ఆయన భార్య జెన్నీఫర్ రాబర్ట్‌సన్ కోర్టుకు తెలిపారు.

దీంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు కోర్టు.. క్వాడ్రిగా సంస్థకు ఓ నెల రోజుల సమయం ఇచ్చింది. చూడాలి మరి.. ఈ నెల రోజుల వ్యవధిలో క్వాడ్రిగా అధికారులు ఏం చేస్తారో, రుణదాతలకు ఎలా చెల్లింపులు జరుపుతారో?