మహా తల్లి!: కన్న బిడ్డను మర్చిపోయి విమానం ఎక్కేసింది, ఆ తర్వాత ఏమైందంటే.?

mother forgets her newborn at airport, Newsxpressonline

రియాద్: సాధారణంగా ప్రయాణాల్లో ఏదో ఒక వస్తువు మర్చిపోవడం మామూలే. కానీ, ఓ మహిళ మాత్రం కన్న బిడ్డనే మర్చిపోయి విమానం ఎక్కేసింది. ఆ తర్వాత గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ విమాన సిబ్బందిని హడలెత్తించింది. దీంతో చేసేదేం లేక విమాన సిబ్బంది కూడా ఆమెకు సహకరించి తిరిగి ఆ విమానాన్ని విమానాశ్రయంకు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది.

సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళుతున్న ఎస్వీ832 విమానంలో ఓ మహిళ ఎక్కింది. తీరా మార్గం మధ్యలో తన బిడ్డను మర్చిపోయానని గుర్తించి భోరున విలపించింది.

వెయిటింగ్ హాల్‌లోనే తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కానని విమాన సిబ్బందితో వాపోయింది. దీంతో వారు ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి సమాచారం అందించి విమానంను తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. పైలట్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోవడం ఏటీసీ అధికారుల వంతైంది.

మానవతా దృక్పథంతో విమానం వెనక్కి రావడానికి అనుమతివ్వడం, విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో ఈ కథ సుఖాంతమైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో కన్న బిడ్డను మర్చిపోవడమేంటి తల్లీ అంటూ నెటిజన్లు సదరు మహిళపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.