భారత్‌పై పాక్ భారీ కుట్ర.. మసూద్ అజర్ రహస్య విడుదల

11:10 am, Mon, 9 September 19

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్‌పై పాకిస్థాన్, ఆ దేశ రాజకీయ నాయకులు విషం కక్కుతూనే ఉన్నారు. మరోవైపు పాక్ రేంజర్లు కూడా సరిహద్దుల్లో దాడులకు తెగబడుతున్నారు.

ఇంకోవైపు దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో మరో కుట్రకు ఆ దేశం పావులు కదుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది.

గతంలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అరెస్టు చేసిన ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తాజాగా రహస్యంగా విడుదల చేసినట్లు ఐబీకి సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి.

రాజస్థాన్-కశ్మీర్ సెక్టార్లలో భారీ కుట్రకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేందుకు రెండు రోజుల క్రితం అజార్‌ను విడుదల చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేయాలని సూచించింది.