మోడీ నినాదాలతో హోరెత్తిన హ్యూస్టన్ సభ

8:13 am, Mon, 23 September 19

హ్యూస్టన్: అమెరికాలోని హ్యూస్టన్ సభ ఆదివారం రాత్రి మోడీ నినాదాలతో హోరెత్తింది. హ్యూస్టన్‌లోని ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగి ‘హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు.

ఆయన వేదికపైకి రాగానే నమో నినాదాలతో సభ హోరెత్తింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 50వేల మందికిపైగా ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అమెరికాలోని రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద భూతాన్ని తరమివేస్తామంటూ అమెరికా గడ్డపై నుంచి శపథం చేశారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్‌ను అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందంటూ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు.

అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులు పొరుగుదేశంలో ఉన్నారని మోడీ ఆరోపించారు.