అమెరికా కన్నెర్ర.. అయినా లెక్కచేయని భారత్! రష్యా ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకే మొగ్గు…

12:54 am, Tue, 9 July 19
russian-s400-missile-defence-system

న్యూఢిల్లీ: అమెరికా కన్నెర్రను భారత్ లెక్కచేయలేదు.. రష్యాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. అంతేకాదు, ఆ ఒప్పందంలో భాగంగా తొలివిడత డబ్బు కూడా చెల్లించేసింది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలంటూ అమెరికా ఆంక్షలను సైతం లెక్కచేయకుండా రష్యాతో ఆదినుంచీ ఉన్న తన మైత్రీ బంధాన్ని చాటుకుంది.

రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కోనుగోలు చేయాలని భారత్ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఆ దేశంతో చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం కూడా కుదిరింది.

అమెరికా బెదిరించినా…

అయితే రష్యా నుంచి ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ సమకూర్చుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో రష్యా నుంచి ఆ వ్యవస్థను కొనుగోలు చేసేటట్లయితే తమ ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.

చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 8 నగరాలకు సునామీ హెచ్చరిక!

అయినా సరే, అమెరికా విధించిన ఆంక్షలను పక్కనబెట్టి భారత్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా తాజాగా రష్యాకు తొలి విడతగా 5.2 బిలియన్ డాలర్లను భారత్ చెల్లించింది.

ఏమిటీ క్షిపణి రక్షణ వ్యవస్థ?

ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ అత్యాధునిక సాంకేతికతో రూపుదిద్దుకున్నది. శత్రు దేశాల యుద్ధ విమానాలు జారవిడిచే క్షిపణులను ధ్వంసం చేయగల సత్తా ఈ వ్యవస్థకు ఉంది. అంతేకాదు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను కూడా ఇది నామరూపాలు లేకుండా చేయగలదు. అలాగే 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం గుర్తించగలదు.

గతేడాది ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. తొలి విడత డబ్బు చెల్లించిన రెండేళ్లకు ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా.. మన దేశానికి అందజేస్తుంది. ఆ తర్వాత నాలుగేళ్ల సమయంలో మిగతా క్షిపణి వ్యవస్థలు కూడా భారత్‌కు సరఫరా చేస్తుంది.

చదవండి: కాలిఫోర్నియాలో భూకంపం.. భయంతో పరుగులుతీసిన జనం

భారత్‌తో జరిగిన అతిపెద్ద ఒప్పందాల్లో.. ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ అని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వ్లాదిమిర్ డ్రోజ్‌హోవ్ వ్యాఖ్యానించారు.

ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య డబ్బు చెల్లింపులు, సరకు సరఫరాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాల నడుమ మరిన్ని ఒప్పందాలు జరగాలని, పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

మొత్తం విలువలో 10 శాతం చెల్లింపు…

మరోవైపు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందం విలువ ఎంత అనేది స్పష్టం కానప్పటికీ.. భారత్ తొలివిడత కింద చెల్లించిన డబ్బు ఆ ఒప్పందం విలువలో 10 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయరాదంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. ‘కాట్సా’ ద్వారా భారత్‌పై మరిన్ని ఆంక్షలు అమెరికా విధిస్తుందని తెలిసినప్పటికీ మోడీ ప్రభుత్వం ముందడుగే వేసింది తప్ప.. అమెరికా బెదిరింపులకు తలొగ్గలేదని రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు.

చదవండి: ఉత్తర కొరియాకు చైనా అధ్యక్షుడు, 2005 తర్వాత తొలిసారిగా, ఎందుకంటే…