కాలిఫోర్నియాలో భూకంపం.. భయంతో పరుగులుతీసిన జనం

11:51 pm, Sun, 7 July 19
earthquake-in-california

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి తీవ్ర భూకంపం సంభవించింది. రాత్రి 8.20 గంటల సమయంలో లాస్ఏంజిల్స్ ప్రాంతానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.

ఒక్కసారి భూమి కంపించడం, అది కూడా ఎక్కువ సేపు ఉండడంతో ప్రజలు భీతిల్లారు. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం జరగలేదుకానీ.. కొన్ని ఇళ్ల పునాదులు బీటలువారాయి, ప్రహరీగోడలు కూలిపోయాయి. ఈ భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది.

కాలిఫోర్నియాలో తెలుగువారు అధికంగా ఉంటారు. దీంతో భూకంపం నేపథ్యంలో వారెలా ఉన్నారోనని వారి కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. రిజ్డ్ క్రెస్ట్ ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. ఆయా చోట్ల హట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు.

ఒక్కరోజు ముందు..

ఈ భూకంపానికి ఒక్కరోజు ముందు.. అంటే గురువారం కూడా కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. రిడ్జ్‌క్రెస్ట్ సమీపంలో ఉన్న మోజేవ్ ఎడారిలో భూమి తీవ్రంగా కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలోనూ కూడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదుగానీ.. భూకంపం ధాటికి కొన్ని గ్యాస్ పైపులైన్లు పగిలిపోయాయి. ఫలితంగా కొన్ని ఇళ్లలో మంటలు లేవడంతో ఆస్తినష్టం సంభవించింది. లాస్ ఏంజిల్స్ పట్టణానికి ఈశాన్యం దిశగా 320 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

20 ఏళ్ల కిందట కూడా…

శుక్రవారం రాత్రి తాజాగా సంభవించిన తీవ్ర భూకంపం నేపథ్యంలో 20 ఏళ్ల క్రితం కాలిఫోర్నియాలో సంభవించిన తీవ్ర భూకంపం చర్చనీయాంశమైంది. 1994 జనవరి 17న కాలిఫోర్నియా సమీపంలోని లాస్ ఏంజిల్స్‌లోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేల మంది క్షతగాత్రులై ఆసుపత్రుల పాలయ్యారు.

భూమి దాదాపు 10 నుంచి 20 సెకండ్ల పాట్లు తీవ్రస్థాయిలో కంపించడంతో భూమి బీటలువారింది. ఇళ్లల్లో, సూపర్ మార్కెట్లలో ఎక్కడి వస్తువులు అక్కడ చిందర వందరగా పడిపోయాయి. పలు భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్నిచోట్ల గ్యాస్ లైన్ పైప్ ధ్వంసం అవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అప్పట్లో 57 మంది మరణించగా, 7 వేల మందికిపైగానే క్షతగాత్రులయ్యారు. దాదాపు 20 బిలియన్ అమెరికా డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. అప్పట్లో ఈ భూకంపం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని జియోలాజికల్ సర్వే పేర్కొంది.