దక్షిణ నేపాల్ అతలాకుతలం! తుపాను దెబ్బకు 31 మంది మ‌ృతి…

2:58 pm, Tue, 2 April 19
rain-storm-hit-in-nepal

ఖాట్మండూ: దక్షిణ నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి ఇక్కడ భారీ తుపాను పలు ప్రాంతాలను ముంచెత్తుతోంది. తుపాను కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించగా, మరో 600 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

తుపాను తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. పెను గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. బారా, పార్సా జిల్లాలో తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. ప్రజలు అవస్థలు పడుతున్నారు.

రంగంలోకి సైన్యం.. ముమ్మరంగా సహాయక చర్యలు…

నేపాల్‌ సైన్యం, పోలీసు విభాగాలు, సాయుధ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

మరోవైపు నేపాల్‌ ప్రధాని కే.పీ. శర్మ ఓలి తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్‌ స్పందిస్తూ.. ‘‘ఖాట్మండులోని మిడ్‌ ఎయిర్‌బేస్‌లో ఉన్న రెండు బెటాలియన్లను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పంపించాం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా బలగాలు బాధితులను రక్షిస్తాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం..’’ అని తెలిపారు.

చదవండి: అక్కడ అదృశ్యం అయ్యారంటే.. శవాలైపోయినట్లే! అసలు వెరాక్రజ్‌లో ఏం జరుగుతోంది?