ప్రజాక్షేత్రం..విశాఖలో ప్రజలు ఎటువైపు ఉన్నారు? గెలిచే దమ్ము ఎవరిలో ఉంది! 

In whom is the winning in Vishakhapatnam, AP Political Latest News, AP Election News in 2019, Newsxpressonline
- Advertisement -
విశాఖపట్నం:  విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం… ఉన్నత విద్యావంతుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కొత్త తీర్పులు వెలువడుతూ ఉంటాయి. చూడ్డానికి సాదాసీదా బరిగానే కనిపించే విశాఖ పార్లమెంటు ఎన్నికలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సంగతులను నేర్పిస్తూనే ఉంటాయి. పెద్దగా సెంటిమెంట్ వర్కవుట్ కాని ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీల బలాబలాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. 
 
ఆయా పార్టీలు రంగంలోకి దించుతున్న అభ్యర్థులను బట్టి కొన్ని సార్లు మారితే, ఆయా సమయాల్లో నెలకొన్న పరిస్థితులు కొన్ని సార్లు ,గెలుపు అవకాశాలు మరికొన్ని సార్లు ఫలితాలను ప్రభావితం చేసిన దాఖలాలు ఉన్నాయనే చెప్పాలి. అంటే ఎన్నికలు జరిగే సమయంలో దాదాపుగా అన్ని రకాల ఈక్వేషన్లతో ఆలోచించుకుని మరీ ఓటు వేసే విశాఖ వాసులు ఎప్పటికప్పుడు తమ తీర్పు కొత్తగానే ఉండేలా చూసుకుంటారన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తంగా ఏ ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలుపు ఎవరిదన్న విషయాన్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు.
 
ఇకపోతే  ఇక్కడ అధికార టీడీపీ తరఫున దివంగత మాజీ ఎంపీ సీనియర్ రాజకీయవేత్త ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడిగా ప్రచారంలోకి వచ్చిన భరత్ బరిలో ఉన్నాడు. మూర్తి మనవడిగానే కాకుండా టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి కాస్తంత దగ్గర బంధువు కూడా. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు అల్లుడిగానూ జనాలకు బాగానే పరిచయం ఉన్న భరత్, గెలుపుపై మాత్రం ధీమాగానే ఉన్నారు.
 
ఇక విపక్ష వైసీపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ బరిలోకి దిగారు. చాలా కాలం క్రితమే వైసీపీలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు ఈ ఎన్నికల్లో ఆయనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించారు.
 
స్థానికంగా మంచి పేరుతో పాటు ఎంతటి బలమైన అభ్యర్థిని అయినా ఢీకొట్టగలిగే సామర్థ్యం ఉన్న దృష్ట్యా సత్యానారాయణపై వైసీపీకి మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి. సినీ నేపథ్యంతో పాటు పారిశ్రామికంగానూ మంచి పేరు సంపాదించిన సత్యనారాయణ. ఇక్కడ టీడీపీకి ముచ్చెమటలు పట్టించడం ఖాయమేనన్న వాదన కూడా లేకపోలేదు.
 
అలాగే ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే తమ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను రంగంలోకి దించేశారు. ఇటీవలే పార్టీలో చేరిన లక్ష్మీనారాయణకు ఉన్న ఇమేజీని బాగానే వాడుకునేందుకే సిద్ధమైపోయిన పవన్, లక్ష్మీనారాయణ విశాఖ నుంచి పోటీ చేస్తే, ఆయన ఇమేజీతో మరిన్ని స్థానాల్లో తమకు మరింత మేర మంచి జరుగుతుందన్నది పవన్ భావనగా చెబుతున్నారు.  ఇక మరో పార్టీ అయిన అసలు బీజేపీ తన అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి.
 
ఇక అసలు విషయానికి వస్తే… టీడీపీ తన అభ్యర్థిగా భరత్ ను ప్రకటించేందుకు చాలా రోజుల పాటు తటపటాయించింది. పార్టీలోకి కొణతాల రామకృష్ణ లాంటి సీనియర్లు చేరితే ఈ స్థానానికి పరిశీలించవచ్చన్న కోణంలో చాలా రోజుల పాటే వేచి చూసిన చంద్రబాబు భరత్ పేరును ఎట్టకేలకు ప్రకటించేశారు. అయితే ఇక్కడి అభ్యర్థిని ప్రకటించడంలో విపక్ష వైసీపీ తనదైన దూకుడుతో పాటు విస్పష్టతను ప్రదర్శించింది.
 
చాలా రోజుల నుంచి చెబుతున్నట్లుగానే ఎంవీవీ సత్యనారాయణకు తన టికెట్ ఇచ్చేసింది.  ఇక జనసేన వైఖరి కూడా చివరి నిమిషం దాకా అస్పష్టతతోనే ఉందని చెప్పాలి. ఏ ఒక్కరూ ఊహించని విధంగా లక్ష్మీనారాయణ జనసేనలో చేరిపోవడం, వేణు వెంటనే  పవన్ కల్యాణ్ ఆయనకు విశాఖ ఎంపీ సీటు ఇచ్చేయడం జరిగిపోయాయి. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టమైన నేపథ్యంలో ఎవరికి ఏవి బలం కాబోతున్నాయి. ఏవి బలహీనతలు కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
 
 
ముందుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి టీడీపీ భరత్ బలాబలాలని ఒకసారి చూస్తే..భరత్ విశాఖకి చెందిన వాడు కావడం ఆయనకి బాగా కలిసొచ్చే అంశం. అలాగే  ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడిగా సానుకూలత కూడా ఉంది.  అలాగే ఎక్కువ విద్యావంతులు ఉన్న విశాఖలో ఉన్నత  చదువులు చదువుకున్న భరత్ పోటీ చేస్తుండడం ఆయనకి కలిసిరావచ్చు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఇక పొతే భరత్ ని మామ బాలకృష్ణ , నారా లోకేష్ తో పోల్చి చూడటం ఆయనకి మైనస్ గా చెప్పవచ్చు. అలాగే ఆయనకి పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు. చివరి దాకా టికెట్ పై ఇతరుల పేర్లు వినిపించడం కూడా కొంతమేర ప్రభావం చూపే ఆస్కారం ఉంది.
 
ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ బలాబలాలు ఒకసారి చూస్తే..సత్యనారాయణ స్థానికుడు కావడం ఆయనకి బాగా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అలాగే ఉన్నత విద్యావంతుడుగాను , ప్రముఖ పారిశ్రామికవేత్తగాను విశాఖ వాసులకి బాగా సుపరిచితుడు. అలాగే గెలిస్తే  స్థానికులకు అండగా ఉంటాడన్న భావన కలిగించడంలో సఫలం అయ్యాడని చెప్పవచ్చు.
 
అలాగే వైసీపీకి , జగన్ కి ఉన్న మైలేజ్ ఈయనకి కలిసొస్తుంది అని వైసీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పెద్దగా రాజకీయ అనుభవం లేని పరిస్థితి ఈయనకి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అలాగే ఒకవేళ గెలిచినా, బిజినెస్ లకే అధిక ప్రాధాన్యం ఇస్తారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జగన్ పాదయత్రకి వచ్చిన స్పందన చూస్తే ఇక్కడ వైసీపీ జెండా ఎగరవచ్చు అనిపిస్తుంది.
 
ఇక జనసేన విశాఖ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ బలాబలాలు ఒకసారి చూస్తే.. ఈయన  సమర్థవంతమైన పోలీసు అధికారిగా పేరు సంపాదించుకున్నాడు. అలాగే సమాజంపై విస్తృత అవగాహన ఉందన్న భావన ఈయనకి కలిసొస్తుంది. అలాగే పవన్ ఇమేజ్ కూడా జేడీకి మద్దతుగా ఉండటం ఈయనకి కూడా విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
 
ఇక బలహీనతలుగా చెప్పాలిసివస్తే .. చివరి నిమిషంలో జనసేనలో చేరడం , టికెట్ దక్కించుకోవడం జరిగింది. సొంతంగా పార్టీ పెడతానంటూ ఎన్నికనగానే ఆగలేకపోయినట్టుగా జనసేనలో ఎంట్రీ ఇవ్వడం అయన రాజకీయ జీవితం పై ప్రభావం చూపే ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ నాయకుడిగా పెద్దగా అనుభవం కూడా లేదు.
 
ఏది ఏమైనప్పటికి జనసేన, బీజేపీల ఓటింగ్ చీలడంతో భరత్ వెనుకబడే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితి చాలా స్పష్టంగానే కనిపిస్తున్న నేపథ్యంలో, స్థానికుడిగానే బరిలోకి దిగుతున్న వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకే కాస్తంత విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చివరగా అంచనాలు ఎలా ఉన్నా, అంతిమంగా నిర్ణయాన్ని చెప్పాల్సింది మాత్రం ఓటర్లు. ఫలితాల వరకు వేచి చూడక తప్పదు..
- Advertisement -