డేటా చోరీపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు, బీజేపీ నేతలు కూడా…

- Advertisement -

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు విషయంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

పార్టీ నేతలతో కలిసి వైఎస్‌ జగన్‌ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైఎస్ జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ…ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా? అని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని సవివరంగా పేర్కొన్నట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ జరగలేదని జగన్ వ్యాఖ్యానించారు.

‘‘ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్‌ చేస్తున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి..’ అని వైఎస్ జగన్ అన్నారు. 

గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కొలుసు పార్థసారధి, రాజన్న దొర తదితరులు ఉన్నారు. కాగా, ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్ సంస్థల సహాయంతో ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

బీజేపీ నేతల ఫిర్యాదు

రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను బుధవారం ఏపీ బీజేపీ నేతలు కలిశారు. డేటా చోరీ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గంట వ్యవధిలోనే బీజేపీ, వైసీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే… ఇందులో ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు డ్రామా కంపెనీల్లా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

డేటా చోరీ అంశంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే… సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారని కన్నా మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ప్రతి చిన్న కేసుపై ముఖ్యమంత్రి సహా అందరు అధికారులు మట్లాడుతున్నారని అన్నారు. గవర్నర్ కు అన్ని విషయాలను వివరించామని చెప్పారు.

చదవండి: డేటా చోరీ కేసు: ఐటీ గ్రిడ్స్ ఛైర్మన్ అశోక్‌పై లుక్ ఔట్ నోటీసులు

- Advertisement -